కుంబ్లే రాజీనామా చేశాడని తెలిసి షాకయ్యా.. కోహ్లీ ఎందుకిలా చేస్తున్నాడో? కోచ్‌గా సెహ్వాగే బెస్ట్!

శుక్రవారం, 23 జూన్ 2017 (15:31 IST)
అంతర్జాతీయ క్రికెట్ నుంచి గుడ్ బై చెప్పేసి.. ట్విట్టర్లో మస్తుగా ఫాలోవర్స్‌ను కలిగివున్న క్రికెట్ ట్విట్టర్ పిట్ట వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం టీమిండియా కోచ్ రేసులోకి వచ్చేశాడు. ట్విట్టర్లో ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ.. ఆకట్టుకునే సెహ్వాగ్.. క్రికెట్‌కు దూరమైనా.. ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఆ పదవి నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ మ‌ళ్లీ క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. 
 
ఈ నేపథ్యంలో కుంబ్లే స్థానంలో టీమిండియా కోచ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు రవిశాస్త్రిలాంటి దిగ్గజ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అయితే కుంబ్లే స్థానాన్ని భర్తీ చేసే సత్తా సెహ్వాగ్‌కి మాత్రమే ఉందని భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేక‌ర్ తెలిపారు. భారత్ గత ఏడాది సాధించిన విజయాల నేపథ్యంలో భారత్ కోచ్‌గా తాను అనిల్ కుంబ్లేకే ఓటేస్తాను.
 
కానీ కుంబ్లే త‌ర్వాత జ‌ట్టు కోచ్‌గా ఎవ‌రుండాల‌నే విష‌యానికి వ‌స్తే మాత్రం నేను సెహ్వాగ్‌ను ఎంచుకుంటానని వాడేకర్ వ్యాఖ్యానించారు. తాను కోచ్‌గా వున్నప్పుడు అనిల్ కుంబ్లే జట్టులో ఉండేవాడని.. విజయం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేవాడని కితాబిచ్చాడు. అలాంటి వ్యక్తి రాజీనామా వార్త విని షాక్ అయ్యానని వాడేకర్ తెలిపారు. కోహ్లీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తనకు ఏమాత్రం అర్థం కావట్లేదని వాడేకర్ వాపోయాడు.

వెబ్దునియా పై చదవండి