ఐదో వన్డే: శతక్కొట్టిన వార్నర్, మిషెల్ మార్ష్.. భారత్ విజయలక్ష్యం 331 పరుగులు

శనివారం, 23 జనవరి 2016 (14:59 IST)
భారత్‌తో జరుగుతున్న ఐదో వన్డేలోనూ కంగారూలు తమ సత్తా ఏంటో నిరూపించారు. బ్యాట్లు ఝళిపించారు. టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముందుగా టాస్ గెలిచిన ధోనీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తద్వారా తొలుత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల పతనానికి 330 పరుగులు సాధించింది.

తొలి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 122 పరుగులతో విజృంభించాడు. ఓపెనర్ అరోన్ పించ్ (6), స్టీవ్ స్మిత్ (28), జార్జి బెయిలీ (6), షాన్ మార్ష్ (7) వెంట వెంటనే పెవిలియన్ క్యూ కట్టారు. 
 
అయితే షాన్ మార్ష్ తర్వాత వచ్చిన మిషెల్ మార్ష్ (101) కూడా శతకంతో బ్యాట్ ఝళిపించాడు. మార్ష్‌కు మాథ్యూ వేడ్ (36) చక్కని సహకారంతో పర్వాలేదనిపించాడు. అయితే, చివర్లో వచ్చిన జేమ్స్ ఫాల్కనర్ (1), జాన్ హేస్టింగ్ (2)లు వెంటవెంటనే వెనుదిరగడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. తద్వారా భారత్‌కు 331 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినట్లైంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, బుమ్రా చెరో రెండేసి, ధావన్, యాదవ్ చెరొక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి