వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో టీం ఇండియా తరపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేరుతో ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో 60 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన సెహ్వాగ్ ఈ ఘనతను సాధించాడు.
తద్వారా... 21 సంవత్సరాల నుంచి అజహరుద్దీన్ పేరుతో ఉన్న ఈ రికార్డును వీరూ బ్రేక్ చేసినట్లయింది. 1988లో న్యూజిలాండ్‌పై బరోడాలో ఆడిన వన్డే మ్యాచ్‌లో అజహరుద్దీన్ 62 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. అదే రికార్డు ఇప్పటిదాకా కొనసాగుతుండగా, నిన్న వీరూ దానికి చెక్ పెట్టాడు.
ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా వన్డేలలో అత్యంత వేగంగా చేసిన సెంచరీల జాబితాలో వీరూది ఏడో స్థానం కాగా, పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (1996లో శ్రీలంకతో ఆడిన వన్డేలో 37 బంతుల్లో సెంచరీ సాధించి) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, వీరూ ఫాస్టెస్ట్ రెండో సెంచరీ విషయానికి వస్తే.. 2001 ఏడాదిలో కొలంబోలో కివీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 69 బంతుల్లో 100 పరుగులు సాధించాడు.