ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌కు కొత్తగా అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ను అంత తక్కువగా అంచనా వేయలేమని టీం ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐసీసీ ట్వంటీ-20కి అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ను క్రికెట్ పసికూనగా అంచనా వేయడం లేదని ధోనీ స్పష్టం చేశాడు.
ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీం ఇండియాతో బరిలోకి దిగనుంది. మే ఒకటో తేదీన జరిగే ఈ మ్యాచ్‌లో తమ జట్టు సమిష్టిగా రాణించాలని ధోనీ జట్టు సభ్యులకు పిలుపునిచ్చాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో ఏదైనా తప్పులు దొర్లితే మాత్రం సూపర్ 8కి అర్హత సాధించడం కష్టమని ధోనీ హెచ్చరించాడు. ఐసీసీ ట్వంటీ-20లో ఏ జట్టునైనా ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగాలని కెప్టెన్ సూచించాడు.
ఆప్ఘనిస్థాన్ జట్టు గురించి తనకు ఎక్కువ తెలియదని ధోనీ అన్నాడు. అయితే ఆప్ఘనిస్థాన్ గురించి తెలుసుకోకపోవడం మంచిదేనని, తెలిసే ఆ జట్టు సభ్యుల ఆటతీరు గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుందన్నాడు. కానీ ట్వంటీ-20 పోరులో ఏ జట్టుతో ఆడినా గెలవడమే ప్రధాన లక్ష్యంగా తమ జట్టు సన్నద్ధంగా ఉందని కెప్టెన్ చెప్పుకొచ్చాడు.