ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సై : రైనా

ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు... టీం ఇండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనా పేర్కొన్నాడు. టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినందుకు తనకెలాంటి బాధా లేదని అతను స్పష్టం చేశాడు.

ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న టీం ఇండియా జట్టులో ఆడుతున్న రైనా క్రైస్ట్‌చర్చ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ప్రస్తుతం మూడు, ఐదు, లేదా ఆరో బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగడం తనకు కంఫర్ట్‌గానే ఉందనీ, ఎలాంటి సమస్యా లేదనీ చెప్పాడు. భారత జట్టు అద్భుతమైన విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందనీ చెప్పాడు.

22 సంవత్సరాల ఎడమచేతి వాటం ఆటగాడైన రైనా... ప్రస్తుత కివీస్ టూర్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ... బాగానే రాణించాడని చెప్పవచ్చు. మొదటి ట్వంటీ20 మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, 43 బంతుల్లో 61 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరుకు చేయూతనందించాడు. అలాగే, మొదటి వన్డే మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు.

ఇదిలా ఉంటే... గతంలో గాయాలు, పేలవమైన ఆటతీరు తదితర కారణాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత పట్టుదలతో స్వదేశీ మ్యాచ్‌లలో బాగా రాణించి, సత్తా చాటుకున్న రైనా మళ్లీ అంతర్జాతీయ క్రికె‌ట్‌లో స్థానం సంపాదించుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి