ఐసీసీ టీ-20: శ్రీలంకపై భారత మహిళా జట్టు నెగ్గేనా..!?

FILE
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ ఆశలను సజీవం చేసుకునేందుకు శ్రీలంకతో తలపడనుంది. సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై నెగ్గితే భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్తుంది. ఒకవేళ లంక చేతిలో భారత్ పరాజయం పాలైతే మాత్రం సెమీస్ ఆశల్లో మహిళల భారత జట్టు నీరుగార్చినట్లే..!.

ఇప్పటికే ఐసీసీ పురుషుల ట్వంటీ-20 సెమీస్ ఆశలను మహేంద్ర సింగ్ ధోనీ సేన చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ట్వంటీ-20లో పరువు నిలబెట్టుకోవాలంటే.. శ్రీలంకపై భారత మహిళల జట్టు నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంకతో భారత మహిళల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

అయితే శ్రీలంకది కూడా ఇదే పరిస్థితి. కివీస్ చేతిలో ఓడిన శ్రీలంక ట్వంటీ-20 సెమీస్‌లోకి ప్రవేశించాలంటే..? భారత్‌పై నెగ్గాల్సిందే. మరోవైపు శ్రీలంకపై తప్పకుండా గెలిచి, వరుసగా రెండోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించడంపై భారత్ విశ్వాసంగా ఉంది.

ఇప్పటికే, ఆసీస్, విండీస్, కివీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ లీగ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మిథాలీ రాజ్, పూనమ్‌లు లంకతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడితే, భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి