ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బ్రెట్‌లీకి గాయాల బెడద తప్పేలా లేదు. కరేబియన్ గడ్డపై జరుగనున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం బ్రెట్‌లీకి అందని ద్రాక్షలా మారింది. యాషెస్ సిరీస్ సందర్భంగా గాయానికి గురైన బ్రెట్ లీ టెస్టు క్రికెట్ స్వస్తి చెప్పి, ఎంచక్కా ట్వంటీ-20, వన్డేలు ఆడుకుందామనుకున్నాడు.
కానీ బ్రెట్ లీని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఐపీఎల్-3లో ఆడిన ఉత్సాహంతో, ఐసీసీ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లోనూ ఆడుతాడని ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశే మిగిలింది.
ఫలితంగా జింబాబ్వేతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బ్రెట్ లీకి భుజంలో గాయం ఏర్పడింది. దీంతో ప్రతిష్టాత్మక ట్వంటీ-20కి బ్రెట్ లీ దూరమయ్యాడు. ఇంకా బ్రెట్ లీ వెస్టిండీస్ నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు.
ఇకపోతే.. జింబాబ్వేతో మంగళవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడిన బ్రెట్ లీ, నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే సాధించడం గమనార్హం. టెస్టులకు స్వస్తి చెప్పిన బ్రెట్ లీకి ట్వంటీ-20ల్లోనూ గాయంతో ఆడే అవకాశం చేజారిపోవడం దురదృష్టకరమనేని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు బ్రెట్ లీ స్థానంలో ట్వంటీ-20లో ఆడేందుకు బోలింగర్ లేదా రియాన్ హారిస్‌లలో ఎవరేని ఒకరిని వెస్టిండీస్‌కు పంపే దిశగా ఐసీసీ సన్నాహాలు చేస్తుంది. ఐపీఎల్-3లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన బోలింగర్, రియాన్ హారిస్‌లు ఫామ్‌లో ఉండటం విశేషం. కాగా ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో మే 2వతేదీన (ఆదివారం) తొలి మ్యాచ్ ఆడనుంది.