ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ మాదే..!: మహేంద్ర సింగ్ ధోనీ

PTI
కరేబియన్ గడ్డపై జరుగనున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌ను తప్పకుండా సాధించి తీరుతామని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నమ్మకం వ్యక్తం చేశాడు. కప్ సాధించడమే అందరి లక్ష్యమని ధోనీ వెల్లడించాడు.

టి-20 ప్రపం చకప్‌లో పాల్గొనేందుకు వెస్టిండీస్‌ బయలుదేరే ముందు ధోనీ కోచ్‌ కిర్‌స్టెన్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఐపీఎల్ టోర్నీతో క్రికెటర్లు అలసిపోలేదని, విండీస్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్‌లో తప్పకుండా విజేతగా నిలుస్తామని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ వల్ల ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ అయ్యిందని, కానీ ఐపీఎల్ వల్ల క్రికెటర్లకు విశ్రాంతి లేకుండా పోయిందనే వార్తల్లో నిజం లేదన్నాడు. ఐపీఎల్ వల్ల ఆటగాళ్లకు మేలు జరిగిందని ధోనీ వెల్లడించాడు. ఇంకా ట్వంటీ-20 ప్రపంచకప్‌లో వీరు లేకపోవడం జట్టుకు లోటేనని, అయితే అతని స్థానంలో బరిలోకి దిగుతున్న మురళీ విజయ్‌కు ఫలితాలను తారు మారు చేయగలడని మహేంద్ర సింగ్ చెప్పాడు.

ఇంకా రైనా, యూసుఫ్, గంభీర్‌లతో తమ జట్టు పటిష్టంగా ఉందన్నాడు. టి-20 ప్రపంచకప్‌ను సాధించే సత్తా టీమిండియాకు ఉందన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తాము సమతుల్యంగా ఉన్నామన్నాడు. ప్రస్తుతం జట్టులో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని, సమిష్టిగా రాణిస్తే మరోసారి విజేతగా నిలువడం ఖాయమన్నాడు.

వెబ్దునియా పై చదవండి