ఐసీసీ వార్మప్ మ్యాచ్: ఐర్లాండ్‌పై ఆప్ఘనిస్థాన్ గెలుపు!

FILE
ఐసీసీ ట్వంటీ-20 టోర్నమెంట్‌ వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఆప్ఘనిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుయానాలో బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ధేశించిన 133 పరుగులను మూడు బంతులు మిగిలి వుండగానే ఆప్ఘనిస్థాన్ చేధించి గెలుపును నమోదు చేసుకుంది.

తొలుత టాస్ గెలిచిన ఆప్ఘనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ఐర్లాండ్ ఆటగాళ్లలో మూనీ (42), విల్సన్ (32)లు తప్ప.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లలో ఆల్-రౌండర్ అష్గర్ స్టానికాయ్ మరియు మొహమ్మద్ నాబిల అద్భుత భాగస్వామ్యంతో.. ఆఫ్ఘన్ ఆరు ఓవర్లలోనే 66 పరుగులు సాధించింది. ఆప్ఘన్ ఆటగాళ్లలో కెప్టెన్ నవ్‌రోజ్ మంగళ్ (27), నూర్ అలీ (14), ఖరీమ్ సిద్ధిఖీ (14)లు జట్టును ఆదుకున్నారు. దీంతో ఆప్ఘనిస్థాన్ 19.3 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి, 134 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

ఇకపోతే... ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో డౌలత్ అహ్మద్జాయ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, హమీద్ హాసన్ రెండు వికెట్లు సాధించాడు. అలాగే జద్రాన్, నాబి, షెన్వారీలు తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు ఐర్లాండ్ బౌలర్లలో కుసాక్, డాక్రెల్ చెరో రెండేసి వికెట్లు సాధించారు. జాన్‌స్టన్ ఒక వికెట్ పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి