క్రికెట్ సంబంధాలు: బీసీసీఐ, పీసీబీ సంప్రదింపులు

భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం పాక్‌తో భారత్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను తెంచుకున్న సంగతి తెలిసిందే. వీటిని పునరుద్ధరించడంపై ఇరుదేశాల బోర్డుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.

సమీప భవిష్యత్‌లో తటస్థ వేదికలపై క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇరుదేశాల బోర్డులు ప్రయత్నిస్తున్నాయన్నారు. పీసీబీ యంత్రాంగంతో ఈ వారం బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పునరుద్ధరించే దిశగా ఈ చర్చల్లో సంకేతాలు కనిపించాయని పీసీబీ అధికారులు వెల్లడించారు.

దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు పీసీబీ కట్టుబడి ఉందన్నారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లు పీసీబీ ఆర్థిక పరిస్థితిని కూడా బాగా మెరుగుపరుస్తాయని, అంతేకాకుండా బ్రాడ్‌కాస్టర్లతో ఉన్న పేచీలు కూడా పరిష్కారం అవతాయని పీసీబీ భావిస్తోంది. భారత్‌తో పీసీబీ కనీసం ఒకటి లేదా రెండు వన్డే మ్యాచ్‌లు, ఒక ట్వంటీ- 20 మ్యాచ్‌ను తటస్థ వేదికలపై నిర్వహించే ఆలోచన చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి