థామ్సన్‌కు చోటు.. సౌథీపై వేటు..!

టీం ఇండియాతో జరగబోయే నాలుగో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్‌రౌండర్ ఇవెన్ థామ్సన్‌కు చోటు లభించగా.. పేస్ బౌలర్ టిమ్ సౌథీపై వేటుపడింది. ఈ రెండు మార్పులు మినహాయిస్తే, కివీస్ జట్టు మొత్తం యథాతథంగా ఉంది.

ఇదిలా ఉంటే... మూడో వన్డేలో పది ఓవర్లు వేసిన సౌథీ వికెట్లమీ పడగొట్టకుండా 105 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 392 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు లక్ష్యానికి 58 పరుగుల దూరంలో ఆలౌటయి పరాజయం పాలైంది. దీంతో కివీస్ బోర్డు సౌథీని పక్కన పెట్టింది.

ఇక.. గత ఏడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన థామ్సన్ గాయపడిన ఇయాన్ బట్లర్ స్థానంలో కివీస్ వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఆక్లాండ్‌లో మార్చి 14న జరిగే ఐదో వన్డేకు బట్లర్ అందుబాటులో ఉండనున్నాడు.

ఈ సందర్భంగా న్యూజిలాండ్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గ్లెన్ టర్నర్ మాట్లాడుతూ... ఐదో వన్డే జట్టును తరువాత ప్రకటిస్తామని నెల్లడించారు. కాగా, టీం ఇండియా, ఆతిథ్య కివీస్ జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం హామిల్టన్‌లోని సెడన్ పార్కులో జరగనున్న సంగతి పాఠకులకు విదితమే.

వెబ్దునియా పై చదవండి