నాలుగో వన్డే‌కు సచిన్‌ దూరం..?

టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో వన్డేకు... భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గాయం కారణంగా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం హామిల్టన్‌లో జరగనున్న ఈ వన్డే నుంచి ఉదరభాగంలో నొప్పి కారణంగా మాస్టర్ వైదొలిగే అవకాశం ఉంది.

కాగా, రెండో వన్డే ఆడుతున్నప్పుడు ఒబ్రియాన్ బౌలింగ్‌లో బంతి సచిన్ ఉదర భాగంలో గట్టిగా తగిలి గాయమయ్యింది. దాన్ని పట్టించుకోకుండా మూడో వన్డేలో ఆడిన సచిన్ 70 పరుగులు చేసిన తరువాత ఆ నొప్పి తిరగబెట్టింది. సెంచరీ దాటాక నొప్పి తీవ్రమైనప్పటికీ, పంటి బిగువున భరించిన సచిన్ 163 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

సచిన్‌కు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ తీయగా, గాయం అంత తీవ్రమైనదేమీ కాదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సచిన్ ఆడేదీ లేనిదీ మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం వెల్లడి కానుంది. కాగా, సోమవారం సచిన్, జట్టు వైద్యుడు నితిన్ పటేల్ ఆసుపత్రిలో ఉండగా మిగతా జట్టు విహారానికి వెళ్లింది.

వెబ్దునియా పై చదవండి