పాక్ ఆటగాళ్ల మానసిక పరిస్థితి బాగోలేదు..!: ఇంతికాబ్

FILE
పాకిస్థాన్ ఆటగాళ్ల మానసిక పరిస్థితి బాగోలేదని ఆ జట్టు మాజీ కోచ్ ఇంతికాబ్ ఆలమ్ అభిప్రాయపడ్డారు. పాక్ ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురికావడంతోనే క్రీజులో రాణించలేకపోతున్నారని ఆలమ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటన చేపట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డే మ్యాచ్‌లు మరియు ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ను ఆడింది.

కానీ ఆసీస్‌‍తో జరిగిన టెస్టు, వన్డే, ట్వంటీ-20ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ నెగ్గలేకపోయింది. ఇదే తరహాలో ప్రస్తుతం కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి, ఆటగాళ్ల మానసిక పరిస్థితే ప్రధాన కారణమని ఇంతికాబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐసీసీ ట్వంటీ-20లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ పేలవమైన ఆటతీరుపై ఏర్పాటైన కమిటీ సమావేశంలో ఇంతికాబ్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఆటగాళ్లు బాధ్యతారహితంగా ప్రవర్తించడం, కోచ్‌ సలహాలను సరిగ్గా పాటించకపోవడమే ఓటమికి కారణమని ఆలమ్ అన్నారు. అలాగే పాక్ క్రికెటర్లు డ్రెస్సింగ్ విధానం, ఓర్పుతో ఎలా మాట్లాడాలనే విషయం తెలియట్లేదని ఆయన చెప్పారు.

దీనికి సంబంధించి ఏడుగురు క్రికెటర్లపై జరిమానాను కూడా విధించడమైంది. పేలవంగా ఆడిన కారణంగా మరికొందరు ఆటగాళ్లు సస్పెన్షకు కూడా గురైయ్యారని ఆలమ్ వెల్లడించారు.

ఇప్పటికే మొహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్, రాణా నావెద్, అఫ్రిది, కమ్రాన్ అక్మల్ మరియు ఉమర్ అక్మల్‌ల ప్రవర్తన అంతగా బాగోలేదని, వారిపై పీసీబీ నిషేధం వేటు వేసిందని ఆలమ్ గుర్తు చేశారు. మొత్తానికి పాకిస్థాన్ ఆటగాళ్ల మానసిక పరిస్థితి బాగోలేదని తాను అభిప్రాయపడుతున్నట్లు ఇంతికాబ్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి