ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు, సమయం రానే వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఉదయం ఆరున్నర గంటలకే చేరుకున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది.
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత పనులతో పాటు ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి ప్రదర్శించారు. దీంతో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
అలాగే, ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్‌లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లువుండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలు 34,651 (74.70 శాతం).