ప్రపంచ కప్ సెక్రటరీ కార్యాలయం మార్పు

మంగళవారం, 10 మార్చి 2009 (09:15 IST)
శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే 2011 ప్రపంచ కప్ నిర్వహణ పోటీలపై ఇప్పటికే నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో లాహోర్‌లో ప్రారంభించిన ప్రపంచ కప్ సెక్రటరీ కార్యాలయాన్ని కూడా భారత్‌కు మార్చే సూచనలు ఉన్నట్టు పాక్ మీడియా పేర్కొంది.

ఈ సెక్రటరీ కార్యాలయాన్ని పాక్ నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి), 2011 ప్రపంచ కప్ నిర్వహణా కమిటీలు తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఐసిసి వర్గాలు వెల్లడించినట్టు పాక్ మీడియా వెల్లడించింది.

అంతేకాకుండా ప్రపంచ కప్ నిర్వహణ పోటీల అనుమతి కూడా పాక్ పొందడం కూడా ప్రశ్నార్థకమేనని ఐసిసి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లి క్రికెట్ ఆడేందుకు ఏ క్రీడాకారుడు సాహసం చేయడన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ పోటీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ఐసిసి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా వచ్చే ప్రపంచ కప్ పోటీలను భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి