భారత్-పాక్‌‌లే ట్వంటీ-20 ప్రపంచకప్ ఫేవరేట్లు: షేన్ వార్న్

PTI
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్‌లకే కప్‌ను గెల్చుకునే ఆస్కారం ఉందని ఆస్ట్రేలియా స్పిన్ లెజండ్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. మూడో ప్రపంచకప్ టోర్నమెంట్ కప్‌‌లో భారత్-పాకిస్థాన్‌లే ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయని షేన్ వార్న్ చెప్పాడు.

వెస్టిండీస్ గడ్డపై ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌ ద్వారా అనేకమంది భారతీయ క్రికెటర్లకు ప్రాక్టీస్ అయ్యిందని, అలాగే పాకిస్థాన్ కూడా ఈ కప్‌ను గెలిచే అవకాశం ఉందని షేన్ వార్న్ వెల్లడించినట్లు హెరాల్డ్ సన్ పత్రిక తెలిపింది. అయితే ఆస్ట్రేలియా కూడా ఆటతీరులో మెలకువలను గమనించి ధీటుగా ఆడుతుందని షేన్ వార్న్ అన్నాడు.

ఇకపోతే.. భారత్ విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని నాయకత్వ లక్షణాలు భారత్‌ను గెలిపిస్తాయని చెప్పాడు. కానీ భుజం గాయం కారణంతో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ ట్వంటీ-20 మెగా ఈవెంట్‌కు దూరం కావడం టీం ఇండియాకు లోటేనని షేన్ వార్న్ తెలిపాడు. అదేవిధంగా పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా జట్టు సమర్థవంతంగా నడిపించగలడని వార్న్ కితాబిచ్చాడు.

షేన్ వార్న్ గణాంకాల ప్రకారం అత్యుత్తమ ట్వంటీ-20 క్రికెటర్ల టాప్-5 జాబితాలో షేన్ వాట్సన్, కెవిన్ పీటర్సన్, లజిత్ మలింగ, కిరోన్ పోలార్డ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు మహేంద్ర సింగ్ ధోనీకి కూడా స్థానం ఉందని షేన్ వార్న్ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి