రాంచీ దేవాలయంలో టీమిండియా కెప్టెన్ ధోనీ పూజలు!

రాంచీకి సమీపంలోని ప్రఖ్యాత దేవోరి దేవాలయంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పూజలు చేశారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత శ్రీలంకతో కలసి ముక్కోణపు సిరీస్‌లోనూ పాల్గొనేందుకు జట్టులోని ఇతర సహచరులతో కలిసి ఈ నెల 12వ తేదీన ఆసీస్‌కు బయలుదేరి వెళ్లనున్న ధోనీ ఈ పర్యటన దిగ్విజయంగా కావాలని అమ్మవారికి పూజలు చేశాడు.

క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ముందే ధోనీ తరచుగా ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేవాడని అతని సన్నిహితులు, ఆలయ పూజారులు చెబుతున్నారు.

కాగా, ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివిఎస్.లక్ష్మణ్ సహా టీమిండియాలోని ఏడుగురు సభ్యులు బుధవారం రాత్రే బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. జట్టులోని మిగిలిన సహచరులతో కలిసి కెప్టెన్ ధోనీ ఈ నెల 12వ తేదీన చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు బయలేదేరి వెళ్లనున్నాడు.

వెబ్దునియా పై చదవండి