షెడ్యూల్ మరోసారి మార్చండి : హోంశాఖ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఖరారు చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కేంద్ర హోంశాఖ సూచించింది. ఐపీఎల్ భద్రతాపరమైన సమస్యలపై సోమవారం ముగ్గురు సభ్యుల బీసీసీఐ అధికార బృందం కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) రామన్ శ్రీవాత్సవతో చర్చలు జరిపింది.

బీసీసీఐ అధికార బృందానికి దాని కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ నేతృత్వం వహించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ రెండో సీజన్ రెండూ ఒకే సమయంలో జరుగుతుండటంతో భద్రతపరమైన సమస్యలు తలెత్తాయి. రెండింటికీ భద్రత కల్పించడం సాధ్యంకాదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలియజేశాయి.

ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో ప్రభుత్వ భద్రతాపరమైన ఆందోళనలను బీసీసీఐ అధికారులకు హోంశాఖ వివరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ కొత్త షెడ్యూల్‌ను తయారు చేయాలని శ్రీవాస్తవ సూచించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 10న ప్రారంభం కావాల్సివున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి