పలు కేసుల్లో జైల్లో ఉంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ లెజెండ్, పీటీఐ అధినేత ఇమ్రాన్‌కు ప్రాణభయం పట్టుకుంది. తనను జైలులోనే హతమార్చేందుకు పాక్ సైన్యం కుట్రపన్నుతోందన్న భయం ఆయనలో నెలకొంది. అందుకే పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. తనకు ఏదైనా ప్రాణహాని జరిగితే పాక్ ప్రభుత్వం, సైన్యానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. జైలులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీరే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ పార్టీ కార్యకర్తలకు ఆయన కీలక పిలుపునిచ్చారు.
తాను జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఎప్పటికీ నిరంకుశత్వానికి తలొగ్గేది లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యేడాది ఆగస్టు 5న దేశ వ్యాప్త నిరసనలకు పీటీఐ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఈ నిరసనలో పాల్గొనాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. తన సందేశాలను సామాజిక మాధ్యమాల్లో రీట్వీట్ చేసి తన గొంతును మరింతగా వినిపించాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.
తన అర్థాంగి బుప్రా బీబీ పట్ల జైలులో అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సైనిక అధికారి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడని, దోషులుగా తేలిన ఉగ్రవాదుల కంటే కూడా తనను దారుణంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అణిచివేతలకు గురి చేసినా తాను మాత్రం తలవంచనని స్పష్టంచేశారు. తన భార్య సెల్‌లోని టీవీని కూడా ఆపేశారని, జైలులో తమ ఇద్దరి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.