సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు : చావ్లా

శనివారం, 4 అక్టోబరు 2008 (12:55 IST)
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఆడడానికే తడబడుతోన్న ఆస్ట్రేలియాకు టీం ఇండియా చేతిలో కష్టాలు తప్పవని లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పేర్కొన్నాడు. టీం ఇండియాలో కుంబ్లే, హర్భజన్ లాంటి మేటి స్పిన్నర్లు ఉండడం వల్ల ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయని చావ్లా జోస్యం చెప్పాడు.

సన్నాహక మ్యాచ్ రెండో రోజు ఆట అనంతరం చావ్లా మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు రోజుల మ్యాచ్‌లో బోర్డు జట్టు పై చేయి సాధించిందని పేర్కొన్నాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే వికెట్లు తీయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని చావ్లా తెలిపాడు.

రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను నిలువరించడంలో తాను ముఖ్య పాత్ర పోషించడం సంతోషంగా ఉందని చావ్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను టీం ఇండియాకు ఎంపిక కావడం గురించి కాకుండా చక్కగా రాణించడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చావ్లా అన్నాడు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో పాంటింగ్, క్లార్క్ వికెట్లు తీయడం తనకు సంతోషంగా ఉందని లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడడం వల్లే తాను వారి వికెట్లు తీయగలిగానని చావ్లా పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి