అనంతలో ధోనీకి చుక్కెదురు: కేసు కొట్టివేతకు కోర్టు నో!

మంగళవారం, 8 జులై 2014 (14:02 IST)
అనంతపురంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చుక్కెదురైంది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనంతపురం కోర్టులో వేసిన పిటీషన్‌ను కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో హిందువుల పవిత్రదైవంగా భావిస్తున్న శ్రీ మహావిష్ణువు అవతారంలో నటించడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. ఈనెల 7లోపు ధోనిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
 
కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఆయన తరఫున ఢిల్లీకి చెందిన న్యాయమూర్తి పంకజ్ బజ్లా సోమవారం అనంతపురం కోర్టు ముందు హాజరై పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిని పరిశీలించిన ధర్మాసనం పిటీషన్‌ను తోసిపుచ్చింది. పిటీషనర్ సంతకం అసలైంది కాదని, కోర్టు భావించినట్లుగా ప్రతివాద న్యాయవాది గోపాల్ రావు తెలిపారు.
 
కొద్ది రోజుల క్రితం ధోని ఓ వాణిజ్య ప్రకటన కోసం మహావిష్టువు అవతారంలో నటించి చేసిన కామెంట్లపై మనస్తాపం చెందిన విశ్వ హిందూపరిషత్ ఉపాధ్యక్షుడు వై. శ్యాంసుందర్ ధోనికి వ్యతిరేకంగా అనంతపురం కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి