ఐపీఎల్ అనుభవంతో వరల్డ్ కప్‌లో చెలరేగుతా: భజ్జీ

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో ఆడిన అనుభవంతో రాబోయే ట్వంటీ20 ప్రపంచ కప్‌లో చెలరేగి ఆడుతానని టీం ఇండియా ఏస్ ఆఫ్-స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో తాజా ఐపీఎల్-3 అనుభవం దృష్ట్యా టీం ఇండియా పటిష్టమైన జట్టుగా బరిలో దిగుతోందని అన్నాడు.

ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... చాలామంది టీం ఇండియా ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్-3లో పాల్గొన్నారనీ.. ఇందులో ఆడిన అనుభవంతో ప్రతి ఒక్క ఆటగాడూ మంచి ఫామ్‌లో ఉన్నారనీ, ఇది జట్టుకు బాగా కలసివచ్చే అంశమని అన్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, ఎమ్ విజయ్, జహీర్ మరియు తాను కూడా ఐపీఎల్-3 ఫైనల్స్‌లో ఆడిన అనుభవంతో ఉన్నామన్నాడు.

అలాగే.. యూసుఫ్ పఠాన్, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, పియూష్ చావ్లా, ఆశిష్ నెహ్రా.. లాంటి ఇతర టీం ఇండియా ఆటగాళ్లు సైతం ఐపీఎల్-3లో ఆయా ఫ్రాంచైజీలలో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందేనని భజ్జీ చెప్పుకొచ్చాడు. దీంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు మంచి ప్రదర్శనతో దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశాడు. టీం ఇండియా ఖచ్చితంగా ప్రపంచ కప్‌ను గెల్చుకుని విజయంతో స్వదేశానికి తిరిగి వస్తుందని భజ్జీ జోస్యం చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి