ఐసీసీ ట్వంటీ-20 టోర్నీ: వార్మప్ మ్యాచ్‌లో కివీస్ బోణి!

FILE
ట్వంటీ-20 ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ సందడి ఆరంభమైంది. ఈ టోర్నీలో భాగంగా.. వెస్టిండీస్‌లోని గయానాలో బుధవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బోణీ కొట్టింది. క్రికెట్ పసికూన ఐర్లాండ్‌ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో కివీస్ జట్టు గెలుపొందింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో నికోల్ (30), జెస్సీ రైడర్ (64) సూపర్ ఇన్నింగ్స్‌తో కివీస్ 9.2 ఓవర్లలో 104 పరుగులు సాధించింది. ఇందులో జెస్సీ రైడర్ 30 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 64 పరుగులు ఉన్నాయి.

రైడర్ అవుట్ అయిన తర్వాత.. క్రీజ్‌లోకి వచ్చిన మార్టిన్ గుప్తిల్ (50) 35 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థసెంచరీ సాధించాడు. ఇక మిగిలిన ఆటగాళ్లలో వెట్టోరీ 18 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో డాగ్‌రెల్ మూడు వికెట్లు తీశాడు.

ఆ తర్వాత 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ చేతిలో 40 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓడింది. కివీస్ బౌలర్లో మెక్ కల్లమ్ మూడు వికెట్లు సాధించాడు.

వెబ్దునియా పై చదవండి