పాకిస్థాన్ క్రికెట్ మనుగడకు భారత్ తన వంతు సహకారం అందించాలని ఆ దేశ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కమ్రాన్ అక్మల్ విజ్ఞప్తి చేశాడు. పాక్‌లో పర్యటించేందుకు భారత్ అంగీకరించి, తమ దేశ క్రికెట్‌ను పరిరక్షించాలని కోరారు. ఈనెల మూడో తేదీన శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల భీకర దాడితో పాక్‌లో క్రికెట్ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెల్సిందే.
దీనిపై అక్మల్ స్పందిస్తూ.. తమ దేశంలో పర్యటించేందుకు ఒక్క విదేశీ జట్టు కూడా అంగీకరించడం లేదు. ఇది ఖచ్చితంగా తమ దేశ క్రికెటర్లపై ప్రభావం చూపుతుంది. మానసికంగా, ఆర్థికపరంగా నష్టంవాటిల్లుతుందన్నాడు. కరాచీలో జరుగుతున్న దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన అక్మాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి పాకిస్థాన్ ఏకాకి అవుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
అందువల్ల భారత్ స్నేహాస్తం అందించాలని అక్మాల్ విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారికి పాక్‌లో ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాక్ పర్యటనపై భారత్ పునఃపరిశీలన చేస్తే.. వారికే మంచి మేలు కలుగుతుంది. పాక్ క్రికెట్‌ను తిరిగి గాడిన పట్టేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. విదేశీ జట్లు ఇక్కడ పర్యటనకు రాకపోవడం తీవ్రనష్టం. కేవలం క్రికెటర్లకు మాత్రమే కాకుండా.. క్రికెట్ అభిమానులకు సైతం ఇది తీరని లోటు అని కమ్రాన్ అక్మాల్ అన్నాడు.
క్రికెట్ బోర్డుకు టివీ ప్రసార హక్కులు, స్పాన్సర్ల వల్ల ఆదాయాన్ని సమకూరుతుంది. అయితే, ఇది సరిపోదు. ఆర్థికపరంగా ఏర్పడే నష్టం దేశవాళీ క్రికెట్‌పై తీవ్రప్రభావం చూపుతుంది. దీనివల్ల భవిష్యత్‌లో మెరుగైన క్రికెటర్లను తాము కోల్పోతామన్నారు. ఇది భవిష్యత్‌లో దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని 27 సంవత్సరాల అక్మాల్ అభిప్రాయపడ్డాడు.