భారత ఓపెనర్ల కోసం బౌన్సీ పిచ్‌లు సిద్ధం!

న్యూజిలాండ్ గడ్డపై 47 రోజుల సుదీర్ఘ పర్యటన సాగిస్తున్న "టీమ్ ఇండియా"కు బుధవారం అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. ఈ పర్యటన ఆరంభంలో జరిగిన ట్వీంటీ-20లో ఖంగుతిన్న భారత్... ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో దెబ్బతిన్న పులిలా రెచ్చిపోయింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంతవరకు బాగనే ఉన్నా... 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ భారత్‌కు అసలుసిసలు సవాలుగా మారింది.

నాలుగు దశాబ్దాలుగా కివీస్ గడ్డపై సిరీస్ గెలవలేదన్న అపవాదును చెరిపేసుకోవాలనే కృత నిశ్చయంతో భారత్ ఉంది. అయితే, కివీస్ ఆటగాళ్లు మాత్రం భారత బ్యాట్స్‌మెన్స్‌ను బోల్తాకొట్టించే బౌన్సీ పిచ్‌లతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తదనుగుణంగా తొలి టెస్ట్ జరిగే సెడన్ పార్క్‌లో బౌన్సీ పిచ్‌ను రూపొందించాల్సిందిగా పిచ్ క్యూరేటర్‌కు కివీస్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి సలహా ఇచ్చాడు.

గత బుధవారం జరిగిన చివరి వన్డేలో బౌన్సీ బంతులకే భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది. ఈ లోపాన్ని అందిపుచ్చుకునేందుకు కివీస్ ఎత్తులు పైఎత్తులు వేస్తోంది. పిచ్‌ క్యూరేటర్ మాట్లాడుతూ.. తొలి రెండు గంటల ఆట ఆసక్తికరంగా మారుతుంది. బంతిని సీమ్, స్వింగ్ చేసే వాళ్ళకు చక్కగా సహకరిస్తుంది.

అయితే, ఎపుడూ మేఘామృతమే ఉండే ఆకాశం నుంచి ఎపుడు చిన్నపాటి వర్షపు జల్లులు పడుతాయో చెప్పలేమని, వర్షం పడితే మాత్రం ఏ సెషన్‌లోనైనా స్వింగ్ రాబట్టవచ్చని చెప్పాడు. అందువల్ల తొలుత బ్యాటింగ్ చేయడం కత్తిమీద సాములాంటిదని క్యూరేటర్ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి