కెప్టెన్ ధోనీ.. యూ కేరియాన్.. నీకు మేమున్నాం...!!!
FILE
జార్ఖండ్ డైనమేట్, టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్ పునః సమీక్ష పద్ధతిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. మహేంద్ర సింగ్ ధోనీ యూడీఆర్ఎస్పై అవగాహనతో మాట్లాడాలని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు సైతం చురకలంటించడంతో, కెప్టెన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండగా నిలిచింది.
బీసీసీఐతో పాటు కపిల్ దేవ్ కూడా ధోనీ వ్యాఖ్యలు సరైనవేనని కపిల్‌దేవ్ మద్దతు పలికాడు. ఆదివారం భారత్ - ఇంగ్లాండ్‌ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 25ఓవర్ చివరి బంతికి హైడ్రామా జరిగింది. యువరాజ్ బౌలింగ్‌లో బెల్ ఎల్బీడబ్ల్యు అయ్యాడని భారత జట్టు అప్పీల్ చేసింది. కానీ అంపైర్ బిల్లీ బౌడెన్ తిరస్కరించారు. దీంతో ధోనీ రివ్యూకు వెళ్లాడు.
స్టేడియంలోని బిగ్ స్క్రీన్ మీద బంతి వికెట్లకు తగులుతున్నట్లు కనిపించడంతో బెల్ నిరాశగా పెవిలియన్ ముఖం పట్టాడు. దీంతో పెవిలియన్ చేరువయ్యాక అంపైర్ నిర్ణయమే కరెక్ట్ అని రివ్యూలో మూడో అంపైర్ నిర్ణయించారు. ఫలితంగా బెల్ తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఈ విధానంపై కెప్టెన్ ధోనీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా మద్దతు పలికాడు.
అంతేకాదు.. యూడీఆర్ఎస్ నిబంధనలు తెలుసుకుని మాట్లాడాలంటూ ధోనీకి ఐసీసీ ప్రతినిధి డేవ్ రిచర్డ్సన్ సూచించడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఇది రిచర్డ్సన్కు సంబంధం లేని వ్యవహారమంటూ మండిపడింది. ఐసీసీ సీఈవో హరూన్ లోర్గాత్కి బీసీసీఐ లేఖ కూడా రాసింది. ఈ లేఖలో బీసీసీఐ కార్యదర్శి శ్రీనివాసన్ ధోనీకి వత్తాసు పలికారు. రిచర్డ్సన్కు ధోనీని విమర్శించే హక్కు లేదు. మళ్లీ ఇలా మాట్లాడవద్దు అని సూచించారు.
రివ్యూలో ఉన్న లోపం గురించే ధోనీ మాట్లాడాడు. అది నిజమేనన్న విషయం ప్రపంచమంతా చూసింది. దానిపై వ్యాఖ్యానించేందుకు రిచర్డ్సన్ ఎవరని శ్రీనివాసన్ ప్రశ్నించారు. ప్రపంచకప్ జరుగుతున్న కీలక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ధోనీపై ఒత్తిడి పెంచుతాయని శ్రీనివాసన్ చెప్పారు. మ్యాచ్ తర్వాత ఒక కెప్టెన్ మాట్లాడే మాటలపై ఐసీసీ ప్రతినిధి ఇలా స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదేవిధంగా అంపైర్ పునఃసమీక్ష పద్దతి అనైతికమని, ఒకసారి అవుట్‌గా ప్రకటించిన వ్యక్తిని తిరిగి కొనసాగించడమేమిటి? అంపైర్ నిర్ణయాన్ని ఎలా మారుస్తారని అని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశ్నించాడు. ఇలా చేయడం నిర్ణయం తీసుకున్న వ్యక్తిని అగౌరవపరిచినట్లే ఈ విధానాన్ని ధోనీ విమర్శించడం సరేనని కపిల్ చెప్పాడు.