యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ గెలవడం అసాధ్యమని కంగారూలు అంటున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఈసారి ఇంగ్లాండ్ గెలిచే ప్రసక్తే లేదని, సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా గెలిచి తీరుతుందని ఆసీస్ ఆటగాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ఇంగ్లాండ్ క్రికెట్ కోచ్ ఆండీ ఫ్లవర్ బ్రిటీష్ ఆటగాళ్లపై షరతులు విధించాడు.
ఆసీస్ గడ్డపై యాషెస్ గెలిచి 24 ఏళ్లైన తరుణంలో ఆండీ ఫ్లవర్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు తమ వెంట భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను తీసుకురావద్దంటూ ఫ్లవకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది.
అయితే రెండో టెస్టు తర్వాత తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌ను కలుసుకోవచ్చునని ఇంగ్లాండ్ క్రికెటర్లు కొంచెం సడలింపు ఇచ్చాడని ఓ బ్రిటీష్ పత్రిక వెల్లడించింది. ఇదంతా తమ క్రికెటర్ల దృష్టిని ఆటపైనే కేంద్రీకరించడానికేనని ఫ్లవర్ సెలవిస్తున్నాడు.
24 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్‌ను గెలుచుకోవడమే లక్ష్యంగా బ్రిటీష్ క్రీడాకారులు బరిలోకి దిగాలని ఫ్లవర్ భావిస్తున్నాడు. ఇంకేముంది..! ఫ్లవర్ పుణ్యమాని, పాపం, స్ట్రాస్ సేన... ఐదు వారాల పాటు కఠోర బ్రహ్మచర్యం పాటించాల్సిందే..!
కాగా.. ఇంగ్లాండ్ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియాకు ప్రయాణమవుతోంది. తొలి టెస్టు 25 నుంచి బ్రిస్బేన్‌లో, రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి 7 వరకు అడిలైడ్‌లో జరుగనుంది.