శ్రీలంకను మట్టి కరిపించిన భారత్

బుధవారం, 14 మార్చి 2012 (01:49 IST)
ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు పోటీపడుతున్న ఆసియా కప్ క్రికెట్ మొన్న బంగ్లాదేశ్‌లో ప్రారంభమైంది. అందులో రెండవ లీగ్ ఆటలో భారత జట్టు శ్రీలంక జట్టుతో తలపడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైన ఆటలో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ థోనీ బ్యాటింగ్‌ని ఎంచుకున్నాడు.

సచిన్ టెండుల్కర్, గౌతమ్ గంభీర్‌లు మొట్టమొదటి బ్యాట్స్‌మెన్స్ గా రంగంలోకి దిగారు. తడబాటుతో ఆడిన సచిన్ టెండుల్కర్ 19 బంతుల్లో 6 పరుగులు మాత్రమే తీసి అవుటయ్యాడు. మళ్ళీ 100వ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. తర్వాత రంగంలోకి దిగిన విరాట్ కొహ్లీ, గౌతమ్ గంభీర్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు సెంచరీలు పూర్తి చేశారు.

ఇండియా స్కోరు వేగంగా పెరిగింది. అద్భుతంగా ఆడిన గంభీర్ 100, కొహ్లీ 108 పరుగులు తీసి అవుటయ్యారు. గౌతమ్ - కొహ్లీల జంట రెండవ వికెట్ కోల్పోయే సమయానికి 205 పరుగులు జోడించింది. తర్వాత 4వ వికెట్‌కి జత కలిసిన కెప్టెన్ థోనీ, రైనాలు చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించి పరుగుల వర్షం కురిపించారు. చివరికి 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 304 పరుగులు చేసి శ్రీలంక ముందు 305 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

తర్వాత 305 పరుగులు చేస్తేనే విజయం సాధించగలమనే టెన్షన్‌తో ఆడిన శ్రీలంక ప్రారంభ ఆటగాడు దిల్షాన్ 7 పరుగులకే అవుటయ్యాడు. కానీ, అతనితో పాటే రంగంలోకి దిగిన మరొక ఆటగాడు కెప్టెన్ జయవర్ధనే, సంగక్కార కలిసి అద్భుతంగా ఆడి పరుగులు జోడించారు.

పరుగుల వర్షం కురిపించిన జయవర్ధనే 59 బంతుల్లో 78 పరుగులు తీసి అవుటయ్యాడు. తర్వాత కాసేపటికే సంగక్కార కూడా 65 పరుగులు తీసి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన ఆటగాళ్ళెవరూ ఎక్కువ సేపు నిలబడలేకపోయారు.


చివరికి శ్రీలంక జట్టు 45.1 ఓవర్లలో 254 పరుగులకి వికెట్లన్నిటినీ కోల్పోయింది. ఫలితంగా ఇండియా 50 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. భారత బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్ 4 వికెట్లు, అశ్విన్, వినయ్ కుమార్ తలొక 3 వికెట్లు తీశారు. 108 పరుగులు చేసిన విరాట్ కొహ్లీ "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి