రెండు బలమైన టెస్టు జట్లు తలపడుతున్నప్పుడు గెలుపు కోసం చావో రేవో తేల్చుకోవాలనుకుంటున్నప్పుడు తగాదాలు ఘర్షణలు సహజం. కానీ అవతలి కెప్టెన్ గాయపడి తదుపరి మ్యాచ్ ఆడతాడో లేదో కూడా తెలీని పరిస్థితిలో అతడి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా మాట్లాడే, వెటకరించే స్వభావాన్ని, ఆ సంస్కార రాహిత్యాన్ని ఏ పేరుతో పిలవాలి? సందేహమెందుకు... స్టీవ్ స్మిత్.. డీఆర్ఎస్ వివాదంపై తనపై తీవ్ర విమర్శలు చేసిన కోహ్లీపై, అతడి కెప్టెన్సీపై స్మిత్ వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీలో విరాట్ కంటే వైస్ కెప్టెన్ రహానేనే బెస్ట్ అన్నాడు. అంతటితో ఊరకున్నా సరిపోయేది కానీ గాయపడ్డ కోహ్లీ నాలుగో టెస్టులో ఒకవేళ ఆడకపోయినా.. భారత్‌కు జరిగే నష్టమేం లేదని అవతలి జట్టు గురించి వ్యాఖ్యానించడంలో స్మిత్ ఒక కెప్టెన్‌గా అన్ని హద్దులూ దాటిపోయాడు.
రాంచీ టెస్టులో గాయపడిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి టార్గెట్ చేసుకున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమై, టెస్ట్ కెరీర్‌లోనే తక్కువ సగటుకు పడిపోయాడు కోహ్లీ. కెప్టెన్సీలో విరాట్ కంటే వైస్ కెప్టెన్ రహానేనే బెస్ట్ అన్నాడు. మూడో టెస్ట్ రాంచీలో కోహ్లీ గాయపడ్డ సమయంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ రహానే ఎంతో తెలివిగా వ్యవహరించడం తాను గమనించినట్లు చెప్పాడు.
'గాయపడ్డ కోహ్లీ నాలుగో టెస్టులో ఒకవేళ ఆడకపోయినా.. భారత్‌కు జరిగే నష్టమేం లేదని బెస్ట్ కెప్టెన్ రహానే చేతిలో జట్టు ఉంటుంది. అతడు కోహ్లీలా ఉద్వేగానికి లోనవకుండా, గేమ్‌ను అర్థం చేసుకునేందుకు యత్నిస్తాడు అని వ్యాఖ్యానించడం ద్వారా ఆసీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ స్మిత్ స్లెడ్జింగ్‌కు కొత్త అర్థం చెప్పాడనిపిస్తోంది.
మరోవైపు తాను పూర్తిగా ఫిట్గా ఉంటేనే బరిలోకి దిగుతానని విరాట్ తాజాగా స్పష్టం చేశాడు. ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ తో ఫిట్నెస్ పై చర్చించిన తరువాత శుక్రవారం రాత్రి, శనివారం మార్నింగ్ గానీ కోహ్లీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు కాస్సేపట్లో ధర్మశాలలో ప్రారంభం కానుంది.