కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

ఠాగూర్

గురువారం, 7 ఆగస్టు 2025 (18:12 IST)
ఓ మానసిక రోగిని వ్యాధిని నయం చేసేందుకు అతన్ని పెళ్లి చేసుకున్న ఓ మానసిక వైద్యురాలు... చివరకు ఆమె మానసిక రోగిగా మారి ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషాదకర ఘటన హైదరాబాద్, సనత్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సనతనగర్ లోని జెక్ కాలనీలో నివాసం ఉండే సబ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహ గౌడ్ కుమార్తె రజిత అనే యువతి సైకాలజీ చదువు పూర్తి కాగానే బంజారాహిల్స్‌లోని ఓ మానసిక వైద్య శాలలో ఉద్యోగిగా చేరింది. అక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ఈ క్రమంలో అక్కడ మానసిక వ్యాధితో బాధపడుతున్న రోహిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కేపీహెచ్‌బీకి చెందిన రోహిత్ గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. 
 
రజితతో పరిచయం ఏర్పడిన తర్వాత రోహిత్ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అతని మానసిక రుగ్మత నుంచి బయటపడేయాలన్న ఉద్దేశంతో రోహిత్ ప్రేమను రజిత అంగీకరించింది. ఇద్దరూ తమ ప్రేమను పెద్దలకు తెలియజేయడంతో వివాహానికి ఇరు కుటుంబాలు సమ్మతించాయి. దీంతో వారి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయితే రోహిత్ మారుతాడని, మానసిక రుగ్మత నుంచి బయటపడతాడని రజత భావించింది. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
 
భార్య సంపాదనతో జల్సాలు చేయడం ప్రారంభించిన రోహిత్... చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాటిని మానుకోవాలని అనేకసార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదు. దీనికితోడు రోహిత్ తల్లిదండ్రులు అతనికే వత్తాసుగా ఉండి రజతను వేధించ సాగారు. భర్త, అత్తమామలు, మరిది పెట్టే బాధలు భరించలేక రజత ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
 
జూలై 16న ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ తర్వాత కూడా ఆమె సమస్యలు వెంటాడుతూ ఉండటంతో మరింత కుంగిపోయిన రజత జులై 28న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది.
 
బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, తలకు తీవ్రమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్, అతని కుటుంబ సభ్యులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు