టెస్టు క్రికెట్ లోని అసలైన మజాను ప్రదర్శిస్తూ డ్రాగా ముగిసిన రాంచీ టెస్టు భారత్, ఆస్ట్లేలియా రెండు జట్లకూ సంతోషాన్నే కలిగించింది. ఇండియా ఆటగాడు చటేశ్వర్ పుజారా జీవితాంతం గుర్తుండే ఆటను ప్రదర్శించి టీమిండియాను విజయం అంచులవరకు తీసుకొచ్చాడు. ఇక ఆసీస్ జట్టు ఓటమి అంచుల దాకా వెళ్లి ఇద్దరు బ్యాట్స్‌మెన్ల అద్వితీయ ప్రతిభతో ఆటను సేవ్ చేసుకుని సీరీస్‌పై ఆశలను నిలుపుకుంది. ఈ గొప్ప ప్రదర్శనపై ఇరు జట్ల కేప్టెన్లు ఏమంటున్నారో చూడండి.
రాంచీ టెస్ట్‌లో గెలవకపోవడానికి కారణం అదే కోహ్లీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఆసీస్‌ను ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో కోహ్లీ సేన నెగ్గుతుందని ఊహించినప్పటికీ అలా జరగలేదు. ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్స్ జోడి క్రీజ్‌లో పాతుకుపోయి భారత్‌కు విజయాన్ని దూరం చేశారు. లంచ్ విరామానికి ముందు భారత్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ గెలవకపోవడానికి కారణం చెప్పాడు. మిడిల్ సెషన్‌లో బంతిలో హార్డ్‌నెస్ లేకపోవడంతో సరైన గ్రిప్ దొరకలేదని, తాము గెలవకపోవడానికి అదొక కారణమని చెప్పాడు. తమ బౌలర్లు వికెట్ తీయడానికి శ్రమించారని, కానీ బంతిపై పట్టు కుదరకపోవడంతో వికెట్లు తీయలేకపోయామని వివరించాడు కోహ్లీ.
వాళ్లను చూసి గర్వపడుతున్నా : ఆసీస్ కెప్టెన్ స్మిత్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత్ గెలవడం ఖాయమని అంతా భావించారు. కానీ ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్స్ జోడీ క్రీజ్‌లో పాతుకుపోయి భారత జట్టుకు విజయాన్ని దూరం చేశారు. దాదాపు రోజు మొత్తం ఆడి కోహ్లీ సేనకు కఠిన పరీక్ష పెట్టారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తమ ఆటగాళ్లు పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్ష్‌లను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పాడు. మ్యాచ్ కోల్పోకుండా వారు నిలబడిన తీరు చాలా బాగుందని ఇరువురు అద్భుతంగా ఆడారని స్మిత్ చెప్పాడు.