పరాజయాలే గుణపాఠాలు.. అలాంటి చెత్తఆట మళ్లీ చూడరు: కోహ్లీ హామీ

శనివారం, 4 మార్చి 2017 (06:39 IST)
గత రెండేళ్లుగా మంచి క్రికెట్‌ ఆడుతున్నాం. ఒక చెత్త ఆటతో మేం పనికిరానివాళ్లమైపోము. రెండో టెస్టులో మేమేంటో చూపిస్తాం. అంతే కానీ మాపై ఎలాంటి ఒత్తిడీ లేదని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పారు. భారత జట్టుపై తీవ్ర ఒత్తడి పనిచేస్తోందని ఆసీస్ జట్టు కెప్టెన్ స్మిత్ చెప్పిన మాటలకు కోహ్లీ గట్టిగా నవ్వేశాడు. ప్రత్యర్థి జట్టు మాటల యుద్ధాన్ని అస్సలు పట్టించుకోం అన్నాడు.
ఒత్తిడా... నాపైనా లేక జట్టు పైనా! నేను ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నానా నేను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. అంతా బాగుంది. అందుకే చిరునవ్వులు కూడా చిందిస్తున్నాను! మాపై ఒత్తిడి ఉందంటూ ఆసీస్‌ కెప్టెన్‌ చెప్పడం అతని వ్యక్తిగత అభిప్రాయం. మీడియా సమావేశాల్లో ఈ తరహా మాటల యుద్ధం చేయడంలో వారు నిష్ణాతులు అని నాకు బాగా తెలుసు. అయితే వారి మాటలకంటే కూడా మేం మా ఆటపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. 
 
పుణే టెస్టులో కనబర్చిన చెత్త ఆటను మేం మళ్లీ ప్రదర్శించబోమని హామీ ఇస్తున్నాను. ఆ మ్యాచ్‌ ఓడినంత మాత్రాన అన్నీ ఓడతామని కాదు. గత రెండేళ్లుగా మంచి క్రికెట్‌ ఆడుతున్నాం. ఇక్కడా అలాంటి ఆటనే చూపిస్తాం. ఫలితం ఎలా ఉంటుందో సిరీస్‌ ముగిశాక చూద్దాం. మా లోపాలు సరిదిద్దుకునేందుకు తొలి టెస్టు అవకాశం ఇచ్చింది. 
 
మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి మా సన్నాహకాల్లో మార్పు ఉండదు. అదే పట్టుదలతో మేం సాధన చేస్తాం. ప్రత్యేకంగా ఏ ఒక్క ఆటగాడిపైనో దృష్టి పెట్టడం లేదు. టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాను కాబట్టి వికెట్‌ గురించి బెంగ లేదు. మ్యాచ్‌ ముందు పరిస్థితులను బట్టే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం అన్నాడు కోహ్లీ
 
ఇక ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా భారత్‌ జట్టుపై ప్రభావం చూపాలంటే కనీసం 600 వందల పరుగులు చేయాల్సిందేనని భారత్‌పై ఒత్తిడి ఉంది కాబట్టి దాన్ని మేం ఉపయోగించుకుంటామని చెప్పాడు. తొలి టెస్టులో పిచ్‌ కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి మాత్రం పిచ్‌ చాలా భిన్నంగా ఉంది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేం మార్చుకోవాల్సి ఉంది. 
 
ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌ ప్రతీ మ్యాచ్‌లో 400కు పైగా స్కోరు చేసినా సరిపోలేదు. మేం గెలవాలంటే కనీసం 550– 600 పరుగులైనా చేయాలి. ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మాకు మరో విజయం కావాలి. చాలా వేగంగా ఒకటి, రెండు సెషన్‌లలో కూడా మ్యాచ్‌ మావైపు మొగ్గు చూపవచ్చు. 
 
కాబట్టి భారత్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. వారు బలంగా కోలుకునే ప్రయత్నం చేస్తారని తెలుసు కానీ మేం సిద్ధంగా ఉన్నాం. అశ్విన్‌తో పోటీ బాగుంది. గతం లో అతడిని నెట్స్‌లో ఎదుర్కొన్న సమయంలో అతను నాకు లెగ్‌ స్పిన్‌ బంతులేసి తన బలం బయటపడకుండా చూసుకున్నాడు కూడా.     
 

వెబ్దునియా పై చదవండి