ఘోర పరాజయం దిశగా బారత్... 75 పరుగులకు ఆరు వికెట్లు డౌన్

ఆదివారం, 18 జూన్ 2017 (20:57 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోపీలో భారత్ కథ దాదాపు ముగిసినట్లే కనబడుతోంది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 17 ఓవర్లకే ఆరు కీలకవికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా నడుస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు పరుగుల వరదను చేజేతులా సమర్పించుకుని చేతులెత్తేసిన భారత్ చివరకు బ్యాటింగ్‌లో కూడా ఘోరంగా చేతులెత్తేయడం బాధాకరం.
 
పాక్ జట్టు స్పీడ్‌స్టర్ అమీర్ ఖాన్ దెబ్బకు తొమ్మిది ఓవర్లలోపే రోహిత్‌శర్మ, కోహ్లీ, శిఖర్ ధావన్ వికెట్లను కోల్పోయిన టిమిండియా మరొక 8 ఓవర్లు పూర్తి కాకముందే మరో 3 కీలక వికెట్లు -యువరాజ్ సింగ్, ధోనీ, కేదార్ జాదవ్- కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 20 ఓవర్లలోపే కీలక గేమ్‌ను దాయాది చేతుల్లో పెట్టేయడం టీమిండియా చరిత్రలో ఇదే ప్రథమం కావడం గమనార్హం.
 
339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఆదిలోనే కోట్లాదిమంది అభిమానులకు షాక్ కలిగించింది. పాక్ డేంజర్ బౌలర్ మహమ్మద్ అమీర్ తొలి ఓవర్ మూడోబంతికే కీలక బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా బలిగొనడంతో భారత శిబిరంలో ప్రకంపనలు మొదలయ్యాయి. మూడో ఓవర్లో మళ్లీ దెబ్బ తీసిన అమీర్ టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేయడంతో స్టేడియంలోని భారత అభిమానులు మూగపోయారు. 
 
యువరాజ్, ధావన్ నిలకడగా ఆడుతున్నారనిపించిన తరుణంలోనే 9వ ఓవర్లో అమీర్ మళ్లీ దెబ్బ తీశాడు. ధాటీగా ఆడుతున్న శిఖర్ ధావన్ అమీర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తర్వాత మరో 8 ఓవర్లు పూర్తి కాకముందే యువరాజ్ సింగ్, ధోనీ, కేదార్ జాదవ్‌లు వెనుదిరగడంతో అభిమానులు విజయంపై ఆశలు వదిలేసుకున్నారు.  
 
కనీసం పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ పరుగులు తీయకున్నా, వికెట్లు కాపాడుకున్న వైనాన్ని టీమిండియా పూర్తిగా మర్చిపోవడమే నేటి ఘోర వైఫల్యానికి కారణమైంది.
 
వికెట్ల పతనం ఇలా మొదలైంది. 1-0 (శర్మ, 0.3 ov), 2-6 (కోహ్లీ, 2.4 ov), 3-33 (ధావన్, 8.6 ov), 4-54 (యువరాజ్, 12.6 ov), 5-54 (ధోనీ, 13.3 ov), 6-72 (జాదవ్, 16.6 ov)
 
Team india in defeat mood.. 6 wickets gone for 75 runs

వెబ్దునియా పై చదవండి