వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీం ఇండియా అక్కడ నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు ముగిసే సమయానికి రెండు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. సిరీస్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఎగసిపడిన కెరటంలాగా భారత్ కనిపిస్తుంటే, వెస్టిండీస్ మాత్రం వేటాడే పులిగా మారింది.
సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి సత్తాచాటిన భారత బ్యాట్స్‌మెన్, రెండో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. బౌలర్ల పాత్రను పరిశీలిస్తే మొదటి వన్డేలో బ్యాట్స్‌మెన్ భారీ స్కోరుతో కల్పించిన వెసులుబాటును "చావుతప్పి కన్నులొట్టపోయిన" చందంగా సద్వినియోగం చేసుకున్నారు. రెండో వన్డేలోనూ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు వెలుసుబాటు కల్పించారు.
అయితే అది భారీ స్కోరుతో కాదు. అంతంతమాత్రం లక్ష్యాన్ని స్కోరు బోర్డుపై ఉంచి తప్పంతా తమపైనే వేసుకునేందుకు బ్యాట్స్‌మెన్ సిద్ధపడ్డారు. ఏదైతేనేం ఇక్కడ కూడా బౌలర్లు తప్పుబట్టే అవసరం లేకుండా పోయింది. గెలిచినా బ్యాటింగే కారణం, ఓడినా బ్యాటింగే కారణమనుకునే విధంగా భారత జట్టు వెస్టిండీస్ పర్యటన సాగుతోంది.
తొలి రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇదే విషయం అవగతమవుతుంది. ఇదిలా ఉంటే ఆతిథ్య జట్టు తొలి వన్డేలో బౌలర్లు లయతప్పడంతో మూల్యం చెల్లించుకుంది. బ్యాట్స్‌మెన్ పోరాడినా భారీ లక్ష్యంగా ఛేదించడం కష్టమైపోయింది. అయితే రెండో వన్డేలో విండీస్ జట్టు పూర్తిగా పుంజుకుంది. ముఖ్యంగా బౌలర్లు నిప్పులు చెరిగారు.
వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరిగా పెవీలియన్ బాటపట్టారు. ఫలితంగా తమ ముందు ఉన్న స్వల్ప లక్ష్యాన్ని విండీస్ బ్యాట్స్‌మెన్ అలవోకగా ఛేదించి సిరీస్‌ను సమం చేశారు. ఈ రెండు మ్యాచ్‌లు జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐస్‌లెట్‌లో జులై 3, 5 తేదీల్లో జరుగుతాయి.