తెలంగాణ రాష్ట్రంలో వేసవికాలం ప్రారంభంకాకముందే భానుడి భగభగం మండిపోతున్నాయి. ఇపుడే కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీలు చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి స్థాయి మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఎండ తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.
పైగా, ఫిబ్రవరి నెలలోనే మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రాష్ట్రంలో మంగళవారం సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 37, వరంగల్లు, నిజామాబాద్లో 37, మహబూబాబాద్ జిల్లాలో 36.1, మెదక్ జిల్లాలో 35.4, కరీంనగరులో 35.2, హైదరాబాద్ జిల్లాలో 34.2, నల్లగొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.