భారత్ బౌలర్ల రాణింపు: కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా

మొహలీలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శనివారం భారత బౌలర్లు రాణించడంతో, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లను చేజార్చుకొని కష్టాల్లో పడింది. అంతకుమందు బ్యాట్స్‌మెన్ కూడా బాధ్యతాయుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు. దీంతో భారత్ శనివారం మ్యాచ్‌లో పైచేయి సాధించింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. హసీ (37) క్రీజ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 367 పరుగులు వెనుకబడి ఉంది. రేపు (ఆదివారం) ఉదయం సెషన్‌ రెండు జట్లకు కీలకం కానుంది. మొదటి టెస్ట్‌లో సెంచరీ చేసిన హసీ క్రీజ్‌లో ఉండటం భారత్‌కు కూడా ప్రమాదకరమే.

హేడెన్ (0) మరోసారి జహీర్ ఖాన్‌కే వికెట్ సమర్పించుకొని పెవీలియన్ బాట పట్టడంతో శనివారం ఆస్ట్రేలియాకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం కెప్టెన్ పాంటింగ్ (5) కూడా తక్కువ స్కోరు వద్దే వెనుదిరిగాడు. కటిచ్ (33), క్లార్క్‌ (23) వికెట్‌లను కూడా పడగొట్టి మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత బౌలర్లు ఆస్ట్రేలియా శిబిరంలో ప్రకంపనలు సృష్టించారు.

భారత బౌలర్లలో లెగ్‌స్నిన్నర్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్‌కు 469 పరుగుల వద్ద తెరపడింది. సౌరవ్ గంగూలీ (102), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (92) రాణించడంతో భారత్‌కు భారీ స్కోరు చేయగలిగింది. గంగూలీకిది 16వ టెస్ట్ సెంచరీ.

శనివారం ఉదయం 311/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఇషాంత్ శర్మ (9) రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన భారత్‌ను గంగూలీ- ధోనీ ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి