ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

మురళి

సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (22:31 IST)
సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఒక పథకం ప్రకారం". వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్‌పై గార్లపాటి రమేష్‌తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయాలివే..
 
ప్రశ్న : మీ సినీ జర్నీ ఎలా ప్రారంభమైంది? మాలీవుడ్‌లో మీరు చేసిన చిత్రాలేంటి? 
జవాబు : చాలా చిన్న వయసులో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను అక్కడ ప్రొడక్షన్ చేశాను. చాలా చిత్రాలను నిర్మించాను. దర్శకత్వం వహించాను. నేను చేసిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఫాహద్ ఫాజిల్‌ను, గోపీ సుందర్ వంటి వారిని ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను. ఇప్పుడు మమ్ముట్టి సర్, ఫాహద్ ఫాజిల్‌లతో ప్రాజెక్టులు కూడా చేస్తున్నాను.
 
ప్రశ్న : "ఒక పథకం ప్రకారం" సినిమా జర్నీ ఎలా ప్రారంభమైంది?
జవాబు : చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెలుగు వాళ్లుండే వారు. వారింట్లోనే నేను ఎక్కువగా ఉండేవాడ్ని. అలా నాకు తెలుగు అలవాటు అయింది. ఆ టైంలో వారింట్లో నేను ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని. తెలుగులో నాకు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. పైగా నాకు సాయి రామ్ శంకర్ ఎప్పటి నుంచో తెలుసు. మేం ఇద్దరం చాలా మంచి స్నేహితులం. ఓ సారి ఈ కథ గురించి చెప్పాను. అలా ఈ జర్నీ ప్రారంభమైంది.
 
ప్రశ్న : "ఒక పథకం ప్రకారం"  ఎలా ఉండబోతోంది? కాన్సెప్ట్ ఏంటి?
జవాబు : ఇది ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ప్రతీ శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. ఈ శుక్రవారం మాత్రం ప్రేక్షకులు చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను చూడబోతోన్నారు. తెలుగు ఆడియెన్స్‌కు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లోనే విలన్‌ ఎవరో కనిపెట్టండని ముందే సవాల్ విసురుతున్నాం.
 
ప్రశ్న : "ఒక పథకం ప్రకారం"  ప్రమోషన్స్‌ను ఎలా ప్లాన్ చేశారు?
జవాబు : ఇంటర్వెల్‌ తర్వాత విలన్ ఎవరో కనిపెడితే పది వేలు ఇస్తామని అంటున్నాం. 50 థియేటర్ల నుంచి.. థియేటర్‌కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున బహుమతిని అందిస్తాం. మా సినిమాను వీలైనంత వరకు జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.
 
ప్రశ్న : "ఒక పథకం ప్రకారం" చిత్రంలోని పాత్రలు ఎలా ఉంటాయి?
జవాబు : ఈ చిత్రంలో సాయి రామ్ శంకర్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఇది వరకు కనిపించనట్టుగా తెరపై కనిపిస్తారు. చాలా సెటిల్డ్‌గా నటించారు. శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని పాత్రలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. సెన్సార్ వాళ్లు కూడా సినిమాను చూసి మెచ్చుకున్నారు. చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేలా ఉంటుంది.
 
ప్రశ్న : మాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడా ఏంటి?
జవాబు : అక్కడికి, ఇక్కడికి ఫిల్మ్ మేకింగ్‌లో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా సరే కథను ఎలా చెబుతామనేది ముఖ్యం. ఈ సినిమా వరకు స్క్రీన్ ప్లే వరకు చాలా కొత్తగా ఉంటుంది. ఇదొక ప్రయోగం అనే చెప్పాలి. ఈ సినిమా విషయానికి వస్తే ఆడియెన్సే హీరో. ఇందులో మంచి సందేశం కూడా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు