కర్నాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాబోయే భర్త ఇంటిలో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఐశ్వర్య, అశోక్ కుమార్ అనే యువతీ యువకులు గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. అయితే, ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా, అశోక్ కుమార్‌లు గౌడ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. కులాంతర వివాహం చేసుకునేందుకు తమతమ తల్లిదండ్రులను వారు ఒప్పించారు.
కానీ, వరుడు తల్లిదండ్రులు కఠిన షరతులు పెట్టారు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఐశ్వర్య కుటుంబ సభ్యులు తమతో సంబంధం కొనసాగించడానికి వీల్లేదని, తమ కుటుంబ వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో తమ కుమార్తె భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా సమ్మతించారు.
ఈ క్రమంలో ఈ నల 23వ తేదీన వారి వివాహం జరగాల్సివుంది. పెళ్లికి ముందు జరిగే తంతు కూడా మొదలైంది. కానీ, సోమవారం ఉదయానికి వరుడు ఇంటిలో ఐశ్వర్య ఉరికంభానికి వేలాడుతూ కనిపించింది. దీనిపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు విచారిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి కావడం వల్లే హత్య చేశారంటూ మతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు.