ఏపీలోని జిల్లా కేంద్రమైన కర్నూలులో ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. పట్టణంలో ఒకే రోజు రెండు హత్యలు చోటుచేసుకోవడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని రాధాకృష్ణ టాకీస్ వద్ద స్థానిక బంగారు షాపు యజమాని హీజార్‌పై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు, సాయి వైభవ్ నగర్‌లో 70 యేళ్ల వృద్ధురాలు శివలీలను దోపిడీ దొంగలు హత్య చేశారు. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండగా, తలపై బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, గొలుసు కనపడటం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పట్టణంలో ఒకే రోజు రెండు హత్యలు జరగడంతో నగర ప్రజలు భయాందోళనకు గరవుతున్నారు.