హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళా న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగో అంతస్తు భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్, చందానగర్‌లోని లక్ష్మీ విహారం ఫేజ్-1 డిఫెన్స్ కాలనీలో జరిగింది. ఈమె నివాసం ఉంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలి పేరు శివాని. ఈమె ఐదేళ్ల క్రితం అర్జున్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే, శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శివానీ ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసులో మృతురాలి భర్త అర్జున్ స్థానిక పోలీసుకు లొంగిపోయారు.
మృతురాలి తల్లి హేమ మాట్లాడుతూ, తన భర్త చిన్నతనంలోనే చనిపోవడంతో తన కుమార్తెను మేనమామ బాధ్యతలు తీసుకుని చదవించారని చెప్పారు. ఈ క్రమంలో శినానికి చదివించడం వల్ల తాను అప్పులపాలు అయ్యానని తనకు రూ.10 లక్షల ఇవ్వాలంటూ మేనమామ వేధించసాగాడని, దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.
శనివారం మరోమారు ఈ గొడవ జరగడంతో విసిగిపోయిన శివాని ఆత్మహత్య చేసుకునివుంటుందని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, ఆదివారం శివాని కుమారుడు రెండో పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సివుండగా, ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడంతో ఈ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.