భాజపా "జంతర్ మంతర్" తెలంగాణా 'రగడ' వెనుక...

FILE
ఇప్పటివరకూ తెలంగాణా కోసం ప్రాణాలర్పిస్తాం అంటూ సందర్భం దొరికినప్పుడల్లా చాటుకునే పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రమే కనబడేది. ఆ పార్టీకే క్రెడిట్ దక్కుతుందేమోనని ఆ తర్వాత మిగిలిన పార్టీలు అదే బాట పట్టాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఆచితూచి స్పందించేది. కానీ గత రెండు మూడు రోజులుగా ఆ పార్టీ తెలంగాణా కోసం చేస్తున్న హంగామా చూస్తుంటే... పలు సందేహాలు, అనుమానాలు దారితీస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇందులో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కూకటివేరుతో సహా పూర్తిస్థాయిలో పెకలించాలంటే రాష్ట్రాన్ని రెండుగా చీల్చితేనే అది సాధ్యమవుతుందని భాజపా బలంగా విశ్వసిస్తున్నట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే భాజపా హఠాత్తుగా తెలంగాణా నినాదాన్ని భుజాన వేసుకుంది. అంతేనా... జంతర్‌మంతర్ వద్ద పోలీసుల చేతుల్లో తన్నులు తినడం ద్వారా మీడియాను ఆకర్షించడమే కాక తెలంగాణా ప్రజల దృష్టిలో పడింది.

తెలంగాణా వస్తే కాంగ్రెస్ పార్టీ కంటే భాజపాకే లాభాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు. తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ ఇప్పటికే భాజపా గొడుగు కిందే ఉన్నారు. కనుక రేపు రాష్ట్రం ఏర్పాటు జరిగితే ఆయన మద్దతు తమకే ఉంటుంది. అదేవిధంగా తాజాగా కాంగ్రెస్ పార్టీతో కీచులాడి బయటకు వెళ్లి మరో 40 రోజుల్లో పార్టీని స్థాపిస్తానని చెపుతున్న వైఎస్ జగన్ సైతం భాజపా సాయాన్ని తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే కర్ణాకట మంత్రి గాలి జనార్థన్ రెడ్డి జగన్‌తో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి భాజపాతో కలిసి వైఎస్.జగన్ నడిచినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా... ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్ది పంపేయాలన్న దృఢ నిశ్చయంలో భాజపా ఉన్నదనీ, అందుకనే హఠాత్తుగా ఈ తెలంగాణా వాదాన్ని నెత్తిన ఎత్తుకుని ఢిల్లీ వీధుల్లో పోరాటానికి దిగిందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి