రాష్ట్రాన్ని ఒకేసారి వరద ఎందుకు ముంచెత్తినట్లు...?

PTI
కాలజ్ఞానంలో పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కృష్ణవేణి కనకదుర్గమ్మ ముక్కుపుడకను అంటుకునే రోజు దగ్గరకు రానుందా...? అది మూఢ విశ్వాసం అని కొట్టి పారేసినా... ప్రస్తుతం రాష్ట్రంలో వరద ఉధృతిని చూస్తుంటే రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన కలగడం ఖాయం. అసలు మన రాష్ట్రంలో ఒక్కసారిగా జలప్రళయం ఎందుకు చోటుచేసుకున్నట్లు..? అని పరిశీలిస్తే... కొన్ని అంశాలు దృష్టికి వస్తాయి.

అందులో ప్రధానమైనది కర్నాటక రాష్ట్రం మనకు ఎగువున ఎడాపెడా జల ప్రాజెక్టులను నిర్మించి నీటిని భారీగా నిల్వ చేస్తోంది. డ్యాముల్లో పీకల్లోతు నీరు చేరేవరకూ ఆ నీటిని దిగువకు విడుదల చేయడం లేదు. అతిభారీ వర్షం కురిసి, తమ రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందన్నప్పుడు ఒకేసారి అన్ని డ్యాముల గేట్లను ఎత్తివేసి నీటిని భారీగా వదిలేస్తోంది.

ఎగువ నీటిని ఒకేమారు విడుదల చేయడంతో కర్నాటక సరిహద్దు జిల్లాలైన కర్నూలు, చిత్తూరు జలదిగ్బంధంలో ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వంద సంవత్సరాల క్రితం ఇంతటి భారీస్థాయిలో వరద ముంచెత్తిందని గణాంకాలు చెపుతున్నప్పటికీ ఎగువన కర్నాటక రాష్ట్రం నిర్మించిన ప్రాజెక్టులు సైతం ఇందుకు కారణమని చెప్పక తప్పదు.

ఈ రిజర్వాయర్లు మన రాష్ట్రానికే కాదు, కర్నాటక రాష్ట్రానికి కూడా హాని చేసేవే. కనుక కర్నాటక రాష్ట్రంలో ఇటీవల కుప్పలు తెప్పలుగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా తలెత్తుతున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో వాటిని సమీక్షించి, అవసరమైతే నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. లేదంటే ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యరాశులను అందించే కోస్తా ప్రాంతంలో వరద ఛాయలు తప్ప ధాన్య రాశులు కనబడవు.

వెబ్దునియా పై చదవండి