అలీగారూ... ఏమిటిది? హాట్ టాపిగ్గా కామెంట్స్..

సోమవారం, 11 మార్చి 2019 (17:04 IST)
అటూ ఇటూ తిరిగి తిరిగి అలిసిపోయిన సినీనటుడు అలీ ఎట్టకేలకు వైకాపా తీర్థం కూడా పుచ్చేసుకున్నారు. అయితే.. ఆయన వైకాపాలో చేరక ముందు.. చేరిన తర్వాత చేసిన వ్యాఖ్యలను చూస్తున్న రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవిపై హామీ ఇస్తే కానీ ఏ పార్టీలోనూ కొనసాగనని గతంలో బల్లగుద్ది చెప్పిన అలీ వైకాపాలో చేరిన తర్వాత పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడం ఆయన సన్నిహితులను కూడా విస్మయానికి గురిచేసింది. తెదేపాలో అలీ ఆశిస్తున్న స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఖరారు అయిపోవడంతో, ఆయన తన తదుపరి ఆప్షన్‌గా వైకాపాని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైకాపాలో కూడా అలీకి టికెట్‌పై ఎలాంటి హామీ దక్కలేదని పార్టీలో చేరిన తర్వాత ఆయన మాటలు స్పష్టం చేశాయి.
 
ఒకవేళ వైకాపా అధికారాన్ని చేజిక్కుంచుకుని మంత్రి మండలి ఏర్పాటు చేసినా ఎమ్మెల్సీ కోటాలో అలీకి మంత్రి పదవి దక్కుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వైకాపా అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆశావహుల సంఖ్య చేంతాడంత ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారిలో మైనార్టీ నేతల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అంత మందిని దాటుకుని అలీకి మంత్రి పదవి ఎంతవరకూ వస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం ఖచ్చితమైన సమాధానం దొరకని పరిస్థితి.
 
చంద్రబాబు, జగన్, పవన్‌లతో వరుస భేటీల అనంతరం అలీ కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సందర్భంగా అలీ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అనేది ఒప్పుకోక తప్పని నిజం. ‘తెదేపాలో కేవలం టికెట్ మాత్రమే ఇస్తాం.. మంత్రి పదవి ఇవ్వలేం అలీ’ అని ఆఫర్ చేస్తే ఏం చేస్తారని అలీని అడిగిన సందర్భంలో ఆయన ఇచ్చిన సమాధానానికీ, తాజాగా వైకాపా నేతగా మారిన అలీ చేసిన వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన లేదు. అలాంటి ఆఫరే గానీ వస్తే.. నమస్కారం పెట్టి బిజీగా ఉన్నానని వెళ్లిపోతానని బదులిచ్చి మంత్రి పదవిపై అంతగా ఆసక్తి కనబర్చిన అలీ వైకాపాలో చేరాక మాత్రం ప్రచారానికి పరిమితమవుతానని ప్రకటించడం వెనుక జగన్ నుంచి ఖచ్చితమైన హామీనే లభించి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అలీ వైకాపా చేరిక విషయంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే... టికెట్ దక్కకపోయినా అలీ చేరడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయనే వాదన తెరపైకొచ్చింది. వైకాపాలో చేరని పక్షంలో ఇబ్బందులు తప్పవని అలీకి బెదిరింపులు వచ్చాయనీ, అందువల్లే విధి లేని పరిస్థితుల్లో అలీ వైకాపా కండువా కప్పుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా.. అలీ వైకాపా ఎంట్రీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు