బీజేపీకి 'స్నేహపూర్వక విడాకులు' ఇచ్చేద్దాం : ఎంపీలతో చంద్రబాబు

గురువారం, 1 సెప్టెంబరు 2016 (10:31 IST)
భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంసిద్ధమయ్యారు. ఇదే అంశాన్ని సొంత పార్టీ ఎంపీల వద్ద ప్రస్తావించారు. బీజేపీకి స్నేహపూర్వక విడాకులు ఇచ్చేద్దాం అంటూ చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించారు. దీంతో కేంద్ర మంత్రిగా ఉన్న టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి రంగంలోకి దిగారు. ఫలితంగానే కమలనాథుల్లో కదలిక వచ్చినట్టు సమాచారం. 
 
'ఇచ్చిన హామీ మేరకు ఏపీకి సాయంచేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంటే తక్షణం చేయండి. చేయడానికి మీకేమైనా ఇబ్బంది ఉంటే స్పష్టంగా చెప్పండి. స్నేహపూర్వకంగా విడిపోదాం' అని బీజేపీ పెద్దలకు చంద్రబాబు స్పష్టం చేసి, ఇదే విషయాన్ని సొంత పార్టీ ఎంపీల చెవిలో కూడా వేశారు. ఆయన ఈ మాట అన్న తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. 
  
నిజానికి గత రెండేళ్లుగా హోదా.. ఏపీకి సాయంపై ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు కొట్టారు. కానీ, గతంలో ఎన్నడూ విడిపోదామన్న మాట నేరుగా చెప్పలేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలు, పార్లమెంటు వేదికపై చేసిన వాగ్దానాలు, తమ సమస్యలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చచెప్పడం ద్వారా వాటిని సాధించుకొనే ప్రయత్నం చేస్తూనే కాస్త హుందాగా ప్రవర్తించారు. 
 
కానీ, ‘ఇప్పటికి రెండేళ్లు అయింది. నేను ఇంతకాలం వేచి చూస్తూ వచ్చాను. కానీ దానికీ కొంత పరిమితి ఉంటుంది. మేం దోషుల్లా ప్రజల ముందు చేతులు కట్టుకొని నిలబడదల్చుకోలేదు. మీరు మీ హామీ నిలబెట్టుకోకపోతే మీకు మిత్రపక్షంగా ఉన్న పాపానికి ప్రజలు మమ్మల్ని కూడా శిక్షించే పరిస్థితి వస్తుంది. మీరు ఏదో ఒకటి తేల్చుకోండి. ప్రజల్లో ఒకసారి మీపై నమ్మకం పోతే ఆ తర్వాత మీరు ఏం ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఇస్తే తక్షణం ఇవ్వండి. దానివల్ల మేం కూడా రాష్ట్రంలో ప్రజలకు ఫలితాలు చూపించగలం. 
 
అలాకాకుండా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉంటే అదే చెప్పేయండి. మా దారి మేం చూసుకొంటాం. స్నేహపూర్వకంగానే విడిపోదాం. ఊరికే నాన్చితే ఎవరికీ ప్రయోజనం లేదు. మీ మనసులో ఏం ఉందో కూడా వెంటనే చెప్పేయండి. అది చెప్పడానికి కూడా నెలల తరబడి సమయం తీసుకోవద్దు’ అని ఆయన కొంత నిష్కర్షగానే చెప్పారని సమాచారం. విడిపోదాం... అనే మాట చంద్రబాబు నోటి నుంచి నేరుగా రావడం బీజేపీ పెద్దలను కొంత ఒత్తిడికి గురి చేసింది. 

వెబ్దునియా పై చదవండి