నేడు నింగిలోకి మానవరహిత ఆర్టెమిస్-1 - అందరి కళ్లూ ఈ ప్రయోగంపైనే...
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:52 IST)
నేడు నింగిలోకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. మానవుడి విశ్వాన్వేషణలో భాగంగా, ఈ చరిత్రాత్మక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టనుంది. ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనిషిని పంపే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగుగా భావిస్తున్నారు.
ఈ ఆర్టెమిస్-1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌ఎస్ నింగిలోకి దూసుకెళుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే 'ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్' పథంలోకి వెళుతుంది.
3.86 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని చేరుకోవడానికి ఒరాయన్‌కు దాదాపు వారం పడుతుంది. తొలుత చంద్రుడి ఉపరితలానికి ఎగువన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుతుంది. ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ఆ దశలో అది భూమికి 4.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అపోలో యాత్రలో ఇంత దూరం వెళ్లలేదు. ఈ దశలో ఒరాయన్‌లో వ్యోమగాములు ఉంటే భూమి, చంద్రుడిని ఒకేసారి చూడొచ్చు. భూమికి తిరిగి రావడానికి ఒరాయన్.. చంద్రుడి గురుత్వాకర్షణను ఉపయోగించుకుంటుంది.
ఈ వ్యోమనౌక.. గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి దూసుకొస్తుంది. ఆ దశలో గాలి రాపిడి వల్ల ఒరాయన్‌పై 2,750 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉత్పత్తవుతుంది. దీన్ని తట్టుకునేలా ఆ వ్యోమనౌకకు ప్రత్యేక ఉష్ణరక్షణ కవచాన్ని ఏర్పాటుచేశారు.
ఆ తర్వాత పారాచూట్లు విచ్చుకొని ఒరాయన్ వేగాన్ని తగ్గిస్తాయి. కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో ఈ వ్యోమనౌక పడుతుంది. రక్షణ సిబ్బంది దీన్ని వెలికి తీస్తారు. ఈ ఏడాది అక్టోబరు పదో తేదీతో ఈ యాత్ర ముగుస్తుంది.
అసలు ఆర్టెమిస్ అంటే ఏంటి?
గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ ఒక దేవత. జ్యూస్ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.9300 కోట్ల డాలర్లను ఖర్చు చేస్తుననారు. కేవల ఆర్టెమిస్-1 కోసమే రూ.400 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారు. 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్-1 ప్రయాణించే దూరం 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణిస్తుంది.
అయితే, చంద్రుడిపైకి చేరుకోవడానికి ఎస్‌ఎల్‌ఎస్ అనే శక్తిమంతమైన రాకెట్ వ్యవస్థను నాసా సిద్ధం చేసింది. 50 ఏళ్ల కిందట వ్యోమగాములను చంద్రుడిపైకి చేర్చిన అపోలో వ్యోమనౌకను మోసుకెళ్లిన శాటర్న్-5 రాకెట్ కన్నా ఇది చిన్న, సన్నగా ఉంటుంది. అయినా మునుపటి రాకెట్ కన్నా 15 శాతం ఎక్కువ శక్తిని అందిస్తుంది. దీని పొడవు 322 అడుగులు, కాగా బరువు 60 లక్షల పౌండ్లు థ్రస్ట్. అంటే 40 లక్షల కిలోలు అన్నమాట.
ఆర్టెమిస్-1 ప్రయోగం ఎలా జరుగుతుంది...
ఎస్‌ఎల్‌ఎస్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సూల్ ఉంటుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పనిచేయగలదు.
ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ కీలకం. రోదసి యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొనేలా దీన్ని తయారుచేశారు. క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సౌరఫలకాలు ఉంటాయి.
సోమవారం పంపే ఆర్టెమిస్-1లోని కమాండర్ సీటులో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్ సూట్‌ను తొడిగారు. రేడియోధార్మికత నుంచి ఇది ఎంత మేర వ్యోమగామిని రక్షిస్తుందన్నది పరిశీలిస్తారు.
ఇదికాక హెల్గా, జోహర్ అనే రెండు బొమ్మలు కూడా ఒరాయన్‌లో ఉంటాయి. మానవ కణజాలాన్ని సిమ్యులేట్ చేసే పదార్థంతో వీటిని తయారుచేశారు. ఇవి సుదూర అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి.