తిరుపతి నుంచి బాబు - కుప్పం నుంచి చినబాబు.. కలిసొస్తుందా?

శనివారం, 13 అక్టోబరు 2018 (14:15 IST)
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండోసారి తన నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నారా.. 21 సంవత్సరాల పాటు కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారా.. అంతేకాదు కుమారుడు లోకేష్‌ బాబును కుప్పం నుంచి పోటీ చేయించేందుకు సిద్థమవుతున్నారా? నియోజకవర్గం మార్చుకున్న తరువాత చంద్రబాబు తిరుపతిలో గెలుస్తారా.. కుప్పంలో నిలబడే లోకేష్‌ పరిస్థితి ఏంటి..? 
 
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోగలిగిన సత్తా బాబుకు ఉందనేది రాజకీయ విశ్లేషకులు భావన. అలాంటి వ్యక్తి ప్రతి ఎన్నికల్లోను ఎమ్మెల్యేగా నిలబడి భారీ మెజారిటీతో గెలుపొందుతుంటారు. బాబుకు ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తు కావాల్సిందే. మొదట్లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఆ తరువాత కుప్పం నియోజవకర్గాన్ని ఎంచుకున్నారు. 1989 నుంచి 2014 దాకా కుప్పం నుంచి పోటీ చేసిన ఆయన 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. పార్టీ ప్రయోజనాలు, సర్వేల ఆధారంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీఎం సన్నిహితులు చెబుతున్నారు.
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు 1983లో అక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి మీసాల వెంకట్రామ నాయుడు చేతిలో చంద్రబాబు 16 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన చంద్రబాబు కుప్పంకు వలస వెళ్లి అక్కడి నుంచే గెలుస్తూ వస్తున్నారు.
 
చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి సొంత జిల్లాలో ఏనాడు టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలు గెలవలేదు. బాబు వ్యవహార శైలి, సాగదీత వైఖరి, ప్రత్యర్థి పార్టీల్లోని కొందరు నాయకులతో స్నేహాలు కూడా ఇందుకు కారణమని టీడీపీ సీనియర్లు బహిరంగంగా చెబుతుంటారు. అయితే ఈసారి జిల్లాలో మెజారిటీ సీట్లు గెలవాలని బాబు గట్టి నిర్ణయమే తీసుకున్నారట. దీనికితోడు తన కుమారుడు లోకేష్‌ను ఈసారి బ్యాక్ డోర్ నుంచి కాకుండా ఫ్రంట్ డోర్ నుంచే పదవిలోకి తేవాలని అనుకున్నారట. ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి లోకేష్‌కు సేఫ్ నియోజకవర్గం కోసం గుడివాడ, పెనమలూరు, చంద్రగిరిలో సర్వేలు చేసినా ధైర్యం చేసే ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో చినబాబును తన నియోజకవర్గం కుప్పం నుంచి పోటీ చేయిస్తే తప్పకుండా గెలుస్తాడని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారని సమాచారం. 
 
తను తిరుపతి నుంచి పోటీ చేస్తే సులభంగా గెలుస్తానని ఆయన లెక్క. దీంతో తను తిరుపతిలో పోటీ చేయడం వల్ల చంద్రగిరి, శ్రీ కాళహస్తి, నగరి నియోజకవర్గాల్లో కూడా పార్టీ గెలుపు సులుభతరమవుతుందని బాబు భావిస్తున్నారు. ఈ కారణాల వల్ల జిల్లాలో 10కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవచ్చని టీడీపీ సర్వేల్లో వెల్లడైందట. అందుకే బాబు తిరుపతి నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారట.
 
చంద్రబాబు తిరుపతి నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమంటున్నారు టిడిపి నేతలు. రథసారథి ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఆయన వెంటే ఉంటుందంటున్నారు టిడిపి నేతలు. అంతేకాదు చంద్రబాబుపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్న కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆయన కుమారుడు నారా లోకేష్ బాబును కూడా భారీ మెజారిటీతో గెలిపించి తీరుతారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆ పార్టీ నేతలు. తిరుపతి నుంచి చంద్రబాబు, కుప్పం నుంచి లోకేష్‌‌లు పోటీ చేస్తే ఇద్దరినీ ఓడిస్తామంటున్నారు వైసిపి నేతలు. 
 
చంద్రబాబు నాయుడు ఉన్నట్లుండి నియోజకవర్గం మార్చాలన్న నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. కాపులు ఎక్కువ ఉన్న తిరుపతిలో చంద్రబాబు నాయుడు నిలబడితే గెలుపు సాధ్యమా అన్నది ఆశక్తికరంగా మారుతోంది. మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీ చేయని లోకేష్‌‌ను కుప్పంలో నిలబెడితే ప్రజలు ఓటేస్తారా అన్న అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు