పిసిపి చీఫ్‌‌గా రఘువీరా తొలగింపు? ఐనా కాంగ్రెస్ బతుకుతుందా?

గురువారం, 31 ఆగస్టు 2017 (16:07 IST)
అక్కడ ఉన్నదే నలుగురు నాయకులు. వాళ్ళలో మళ్ళీ విభేదాలు. పదేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో నిల్చుంటే పట్టుమని వంద ఓట్లు కూడా సాధించలేకపోయింది. ఈ దుస్థితికి కారణం ఎవరు. పార్టీని నడిపిస్తున్న అధినేతలా.. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులా..
 
కాంగ్రెస్ పార్టీ. మూడన్నరేళ్ల క్రితం దేశంలో ఎక్కడ విన్నా కాంగ్రెస్... కాంగ్రెస్.. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను పూర్తి అధికారాలతో పరిపాలన కొనసాగించిన ఆ పార్టీ ఇప్పుడు జవసత్వాలను కోల్పోయింది. కనీసం వార్డు మెంబర్లను కూడా గెలుచుకోలేని పరిస్థితికి దిగజారింది. రాష్ట్రపతుల నుంచి ప్రధానులను మొదలుకుని రాష్ట్రమంత్రుల వరకు ఎంతోమందికి ఎన్నో పదవులను ఇచ్చిన పార్టీ ఇప్పుడు పూర్తిగా తన అస్థిత్వాన్ని కోల్పోయింది. సరైన నాయకులు లేక అల్లాడిపోతోంది. 
 
ఆంధ్రాలో అయితే ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నదో ఆ రోజు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. పూర్తిగా తుడిచి పెట్టుకపోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
 
అదే విభజన నష్టాన్ని పూడ్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తిరిగి అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ఉన్న నాయకులకు ఇప్పటికీ నిరాశలే ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన నంద్యాల ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. అందరూ కలిసి ఇలాంటి పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించాల్సింది పోయి ఒకరిపై ఒకరు విమర్శల పర్వానికి తెరలేపారు. నంద్యాలలో తక్కువ ఓట్లు రావడానికి రఘువీరా రెడ్డి కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శించడం పెద్ద ఫార్సుగా మారింది. ఐతే కాంగ్రెస్ పార్టీలో కొత్త కలవరానికి దారితీసింది. 
 
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పరిస్థితి తయారైంది. ఓటమి ఎదురైన ప్రతిచోటా ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం. కాకపోతే ఆ దిశగా అడుగులు వేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీకి మరింత కీడు చేస్తుందంటున్నారు మిగిలిన నాయకులు. 2014 సాధారణ ఎన్నికలప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏ మాత్రం పురోగతి చెందలేదన్నది వాస్తవం. పైగా రోజురోజుకు దాని పరిస్థితి దిగజారిపోతోంది. చింతా మోహన్ మాట్లాడేది కూడా అదే. 
 
2014 ఎన్నికల తరువాత ఆరు నెలలలోనే వచ్చిన తిరుపతి ఉప ఎలన్నికలో వైసిపి పోటీలో నిలబడపోయినప్పటికీ టిడిపికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. 10 వేల ఓట్లు సాధించింది. మూడేళ్ళ తరువాత వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పోటీ చేసింది. కానీ వందల ఓట్లకే పరిమితమైంది. నాయకత్వ లోపమే ఈ తిరోగమనానికి కారణమంటున్నారు చింతామోహన్. పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో రఘువీరా రెడ్డి విఫలమయ్యారని ఆయన నాయకత్వంలోనే పార్టీ నడిస్తే మరింత దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. 
 
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా లుకలుకలు బయటపడ్డాయి. అసలే రఘువీరా రెడ్డి కూడా త్వరలో పార్టీ మారబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ఎదురుకావడం ఆ పరిస్థితులకు ఊతమిస్తున్నాయి. నంద్యాలలో ఎదురైన ఘోర పరాభవంతో అక్కడక్కడ మిగిలి ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపిలోనో, టిడిపిలోనే చేరే అవకాశాలున్నాయి. దీంతో ఎపిలో కాంగ్రెస్ పార్టీ జీరో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సంధర్భంలో అధినాయకత్వం కలుగజేసుకుని పార్టీ పురోగాభివృద్థికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 
 
ఇదిలావుంటే చింతా మోహన్‌ మీడియా సమావేశం తరువాత రఘువీరా రెడ్డి ఏకంగా సోనియాగాంధీకి ఫిర్యాదు చేశాడట. ఒక ప్రాంతంలో కూర్చుని మాట్లాడటం కాదు. దమ్ముంటే పిసిపి చీఫ్‌‌గా చేయమనండి చింతామోహన్‌ని అంటూ సవాల్ విసిరారట రఘువీరా. దీంతో ఆ పదవిని చింతామోహన్‌కే అప్పగించాలన్న ఆలోచనలో సోనియా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రఘువీరా పార్టీ మారిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు