ఏపీ కేబినెట్‌ విస్తరణపై చర్చ: నిఘా నివేదికలు తెప్పించుకుంటున్న జగన్

గురువారం, 17 జూన్ 2021 (13:38 IST)
రెండేళ్ల క్రితం ఏపీలో వైసీపీని భారీ మెజారిటీతో అధికారంలోకి తెచ్చాక సీఎం జగన్‌ కేబినెట్‌ బెర్తుల విషయంలో ఎన్నడూ లేనంత భారీ కసరత్తు చేశారు. అప్పట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు సామాజిక సమీకరణాల విషయంలోనూ ఎక్కడా రాజీపడలేదు. దీంతో కేబినెట్‌ బెర్తులపై ఎక్కడా విమర్శలు ఎదురుకాలేదు. అప్పట్లో ఎదురైన భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 90 శాతం మంత్రుల్ని రెండున్నరేళ్ల తర్వాత మార్చి వారిస్ధానంలో మరొకరికి చోటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌లో మరోసారి కేబినెట్‌ మార్పులకు సిద్ధమవుతున్నారు. కేబినెట్‌లో ఎవరుండాలనే దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది.
 
త్వరలో కేబినెట్‌ విస్తరణ
ఏపీలో ప్రస్తుత కేబినెట్‌ మంత్రులు పదవులు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. మరో ఆరునెలల్లో వారంతా రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటారు. గతంలో సీఎం జగన్ వారికి చెప్పిన విధంగా 80 నుంచి 90 శాతం మంత్రులు తమ పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. వారి స్ధానంలో పార్టీలో ఆశావహులు, గతంలో హామీలు ఇచ్చిన వారికి అవకాశాలు దక్కబోతున్నాయి. దీంతో కేబినెట్‌ ప్రక్షాళ అనివార్యం కానుంది. ప్రస్తుత మంత్రుల స్ధానాల్లో మళ్లీ అవే సామాజిక సమీకరణాలు, ఇతర ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేయాల్సి ఉంది. దీంతో నవంబర్‌ లేదా డిసెంబర్‌లో కేబినెట్‌ విస్తరణ చేపట్టే అవకాశముంది.
 
భారీగా ఆశావహులు
గతంలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా పలువురు నేతలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. స్ధానిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలుగా గెలవని వారికి, అవకాశాలు దక్కనివారికి కూడా మంత్రుల్ని చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో వారు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సీనియార్టీ, ఇతర సమీకరణాలు కలిసొస్తున్నా తొలి విడతలో మంత్రులు కాలేకపోయినా వారు కోసం కేబినెట్ బెర్తుల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి కూడా కేబినెట్‌ ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న మంత్రుల స్ధానాల్లో ఎవరెవరు రాబోతున్నారన్న ఆసక్తి స్ధానికంగా కూడా నెలకొంది.
 
జగన్‌ కేబినెట్‌లో వీరికి ఛాన్స్‌?
త్వరలో చేపట్టే కేబినెట్‌ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రుల స్థానంలో కొత్తగా అమాత్యులయ్యే వారిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇందులో తొలి విడత కేబినెట్‌ విస్తరణ తర్వాత పిల్లిసుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి ఎంపీలు కావడంతో మధ్యలో మంత్రులుగా వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజుతో పాటు బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ యాదవ్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, సుచరిత స్ధానాలు సేఫ్ అని తెలుస్తోంది. వీరు కాకుండా మిగిలిన బెర్తుల్లో శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, స్పీకర్‌ తమ్మినేని పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు పార్ధసారధి, జోగి రమేష్‌, తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రోజా వంటి వారు కూడా కేబినెట్‌ బెర్తుల కోసం పోటీలో ఉన్నారు.
 
కేబినెట్‌ బెర్తు దక్కకపోతే జంప్‌?
ప్రస్తుతం ఏపీ కేబినెట్ ఆశిస్తున్న వారిలో పలువురు తమకు అవకాశాలు దక్కుతాయని ఆశాభావంగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు తమకు బెర్తులు ఖాయమని ఆశిస్తున్నారు. అయితే సమీకరణాల పేరుతో తమను పక్కనబెడితే మాత్రం టీడీపీలోకి ఫిరాయించేందుకు లేదా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉండేందుకు సైతం పలువురు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పలువురు నేతలు టచ్‌లో ఉన్నట్లు చెప్తున్నారు. వీరిలో కొందరు గతంలో జగన్ స్వయంగా అమాత్య పదవుల హామీ ఇచ్చిన వారే కావడం మరో విశేషం.
 
ఆచితూచి వ్యవహరిస్తున్న జగన్‌
ఇప్పటికే గవర్నర్ ఎమ్మెల్సీల విషయంలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వారు, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డికి అవకాశాలు ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్న వారు రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు చేశారని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణలో అవకాశాలు దక్కకపోతే మాత్రం పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటం ఖాయంగా తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, నిఘా నివేదికలు, పార్టీ నేతల నివేదికలు తెప్పించుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ పార్టీలో అసంతృప్తి లేదని భావిస్తున్న జగన్.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు