న్యూఢిల్లీ: విమానాశ్రయం అంటే... అది కేవలం ధనికులకు రవాణా సౌకర్యం కల్పించే ప్రదేశం. సామాన్యులు ఇక్కడికి రాలేరు. విమానంలో ఎగరలేరు. ఈ కాన్సెప్ట్ ఇపుడు మనదేశంలో ఎయిర్‌పోర్ట్‌లను ఘోస్ట్ ఎయిర్‌పోర్ట్‌లుగా మార్చేస్తున్నాయి. ఘోస్ట్ ఎయిర్‌పోర్ట్ అంటే... ఈ ఎయిర్‌పోర్ట్‌లో అత్యాధునిక సౌకర్యాలు, రిచ్ లుక్ ఉంటుంది. కానీ, ప్రయాణికులు ఎవరూ ఉండరన్నమాట. ఇలా ప్రయాణికులు లేక బిక్కుబిక్కు మంటున్న ఎయర్‌పోర్టులను ఘోస్ట్ ఎయిర్‌పోర్ట్ అంటారు.
ఇపుడు మన దేశంలో 425 వరకు విమానాశ్రయాలున్నాయి. కానీ, ఇందులో వందకు పైగా ఘోస్ట్‌ఎయిర్ పోర్టులున్నాయి. అంటే, ఇవేవో సౌకర్యాలు లేని అణాకానీ ఎయిర్‌పోర్టులు కావు. ఇందులో వేల కోట్లు పెట్టి కట్టినవి ఉన్నాయి. ఉదాహరణకు రాజస్తాన్ లోని జైసల్మేర్ ఎయిర్‌పోర్ట్‌ని 1500 కోట్లు పెట్టి అత్యాధునికంగా నిర్మించారు. ఏడాదికి 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్ళే కెపాసిటీ దీనికుంది. కానీ, ఇంతవరకు ఒక్క ప్రయాణికుడిని కూడా విమానాలు తీసుకెళ్ళలేని దుస్థితిలో జైసల్మేర్ ఎయిర్‌పోర్టు ఒక ఘోస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా మారిపోయింది.
కనెక్టివిటీ లేకపోవడమే... సమస్య...
ఇలా విమానాశ్రయాలు ఘోస్ట్‌లుగా మారిపోవడానికి ప్రధాన కారణం... కనెన్టివిటీ లేకపోవడం. మరోపక్క విమాన చార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకపోవడం. ఇపుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విమాన ఛార్జీలు తగ్గించడం, మధ్యతరగతికి విమాన యానాన్ని అందుబాటులోకి తేవడం ఇపుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం. మరోపక్క ఎయిర్‌పోర్టులకు మధ్య కనెక్టివిటీని పెంచాలని కొత్త విమాన యాన పాలసీని సిద్ధం చేస్తున్నారు.
దీని ప్రకారం ప్యాసింజర్లు విమానం ఎక్కినా, ఎక్కకపోయినా, ప్రతి విమానంలో 6 సీట్లకు ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. దీని వల్ల విమాన యాన సంస్థలకు నష్టాలు రాకుండా ఉంటాయని, సర్వీసులు చవకగా మారతాయని ఆశిస్తున్నారు. ఎయిర్ ఇండియా కనెక్టివిటీ పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. న్యూ ఎయిర్‌వేస్ పాలసీ వల్ల దేశంలో ఘోస్ట్ ఎయిర్‌పోర్ట్‌లు ప్రయాణికులతో కళకళలాడుతాయని ఆశిద్దాం.