జగన్ ప్రభుత్వంలో ఏయే శాఖల్లో ఏయే ఐఎఎస్‌లు ఉంటారంటే..?
సోమవారం, 13 మే 2019 (17:31 IST)
ఎపిలో వైసిపి అధికారంలోకి వస్తుందని ఐఎఎస్‌లు గట్టిగా నమ్ముతున్నారా. అధికారంలోకి రాకముందే ఐఎఎస్‌లు జగన్ మోహన్ రెడ్డికి టచ్‌లో ఉన్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది. రిజల్ట్స్ రాకముందే అధికారుల ఆత్రుత ఎపిలో చర్చనీయాంశంగా మారుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. చంద్రబాబు మళ్ళీ సిఎం అవుతారా. జగన్‌కు ఆ ఛాన్స్ దక్కుతుందా అన్న విషయంపై ఎపిలో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఎపిలో చాలామంది ఐఎఎస్‌లు వైసిపి అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారట. ఇప్పటికే కొంతమంది ఐఎఎస్‌లు జగన్‌తోను, వైసిపికి చెందిన కొంతమంది ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
జగన్ సిఎం అయితే కీలక పదవులు దక్కించుకునే ఐఎఎస్‌లు ఎవరన్న విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జగన్ సిఎం అయితే ఆ పేషీలోకి ఎవరు వెళతారు. అత్యంత కీలక శాఖలను ఎవరికి కేటాయిస్తారు. కొత్త సిఎం టీం ఎలా ఉండబోతుంది అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోందట అమరావతిలో. ఎపి ప్రధాన కార్యదర్సిగా ఎల్.వి.సుబ్రమణ్యం కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారన్న చర్చ నడుస్తోంది.
గతంలో కిరణ్ కుమార్ రెడ్డి పేషీలో ఉన్న జవహర్ రెడ్డిని సిఎంఓ పేషీలోకి తీసుకునే అవకాశం ఉందట. జవహర్ రెడ్డికి వైసిపితో సంబంధాలున్నాయని తెలిసినా చంద్రబాబు మాత్రం లోకేష్ శాఖలో ఆయన్ని ఉంచారు. ఇరిగేషన్‌లో సుధీర్ఘ కాలం పనిచేసిన ఆదిత్యనాథ్ కూడా జగన్ ప్రభుత్వంలో ఉన్నత స్థానం వస్తుందన్న ప్రచారం నడుస్తోంది. మరో ఐఎఎస్ ధనంజయరెడ్డిని సిఎంఓలోకి తీసుకునే అవకాశం ఉందట.
రిటైర్డ్ అయిన అజేయ్ కల్లంకు జగన్ సర్కార్ వస్తే కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పీవీ రమేష్‌కు కూడా మంచి పోస్ట్ దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబుతో ఢీకొంటున్న ఎల్.వి.సుబ్రమణ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసిపి నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని కూడా ఆ ఐఎఎస్ అధికారి దర్శించుకున్నారట.
ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారుల తీరుపై వైసిపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే భిన్నమైన వైఖరితో ఉన్న నేతలను మాత్రం జగన్ పక్కకు పంపించే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. బయటి ప్రాంతంలో పనిచేస్తున్న ఐఎఎస్‌లను రాష్ట్రానికి తీసుకొచ్చి కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి... అసలేం జరుగుతుందో ఫలితాల తర్వాత.